ది రాజా సాబ్‌: మారుతి క‌న్నీళ్లు... ప్ర‌భాస్ ఓదార్పు... త‌డిచిన ఖ‌ర్చీఫ్‌లు.. !

RAMAKRISHNA S.S.
టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో భారీ చిత్రం తెరకెక్కించే స్థాయికి ఎదిగిన దర్శకుడు మారుతి ప్రయాణం స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. ఈ సంక్రాంతికి జనవరి 9న‌ విడుదల కానున్న రాజాసాబ్ సినిమా మారుతి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలవనుంది. ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో మారుతి ప్రదర్శించిన ఉద్వేగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మారుతి అనగానే ఒకప్పుడు 'ఈ రోజుల్లో', 'బస్టాప్' వంటి చిన్న సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్' వంటి విజయాలతో మీడియం రేంజ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ, గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా అంటే టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, ఫ్యాన్స్‌లోనూ మొదట్లో గందరగోళం నెలకొంది.


ప్రభాస్ కటౌట్‌కు మారుతి సెట్ అవుతారా ? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా ఏడాదికి రెండు సినిమాలు చేసే మారుతి, 'రాజాసాబ్' కోసం ఏకంగా మూడేళ్లు వెచ్చించారు. ప్రభాస్ ఇతర షూటింగ్‌ల వల్ల సినిమా వాయిదా పడుతున్నా , ఓపికగా వేచి చూశారు. 'రాజాసాబ్' ప్రీ-రిలీజ్ వేడుక మారుతి ఒక్క‌సారిగా భావోద్వేగానికి గుర‌య్యారు. ఎప్పుడూ నవ్వుతూ, చమత్కారంగా మాట్లాడే మారుతి, వేదికపై ప్రసంగిస్తూ కన్నీరు పెట్టుకోవడం అభిమానుల మనసులను కదిలించింది.


ఒక సామాన్యుడిగా వచ్చి, దేశంలోనే అతిపెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి చేరడం వెనుక ఉన్న కష్టం ఆ కన్నీళ్లలో కనిపించింది. మారుతి భావోద్వేగాన్ని చూసి సాక్షాత్తు ప్రభాస్ స్వయంగా వేదికపైకి వచ్చి ఆయన్ను హత్తుకుని ఓదార్చడం ఆ వేడుకకే హైలైట్‌గా నిలిచింది. ఇది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పింది. మారుతి ఈ సినిమా కోసం కేవలం కాలం మాత్రమే కాదు, తన సర్వశక్తులూ ఒడ్డారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే, మారుతి పేరు రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి టాప్ డైరెక్టర్ల సరసన నిలుస్తుంది. తన బలమైన కామెడీకి హారర్ ఎలిమెంట్స్ జోడించి ప్రభాస్‌ను విభిన్నంగా చూపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: