తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త నాయకత్వం: ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ..!
ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన సురేష్ బాబు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల అనంతరం ఈసీ సభ్యులు సమావేశమై ఛాంబర్ నూతన పదాధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా అధ్యక్షుడిగా సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీని ఎంపిక చేశారు. ఇక కార్యదర్శిగా అశోక్ కుమార్‌ను, కోశాధికారిగా రామదాసును ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా ఛాంబర్ కార్యవర్గంలో కొనసాగనున్నారు. ఈ నూతన కార్యవర్గం 2027 వరకు తన పదవీకాలాన్ని కొనసాగించనుంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రస్తుతం మొత్తం 3335 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 1421 మంది మాత్రమే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరిశ్రమ అభివృద్ధి, నిర్మాతల సమస్యలు, కార్మికుల సంక్షేమం, సినిమాల నిర్మాణానికి అనుకూల వాతావరణం వంటి అంశాలపై నూతన కార్యవర్గం ప్రత్యేక దృష్టి సారిస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నాయకత్వంతో తెలుగు సినిమా పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని, ఐక్యతతో ముందుకు సాగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.