“మనం ఎందులో వీక్‌గా ఉంటామో అదే పట్టుకుంటాడు”..ఇంట్రెస్టింగ్‌గా ప్రభాస్ ‘రాజా సాబ్’ ట్రైలర్ (వీడియో)..!
ట్రైలర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు అభిమానులను బాగా ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా రెబల్ అభిమానులు ప్రభాస్‌ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, అచ్చం ఆ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను తీర్చిదిద్దినట్టు ట్రైలర్ స్పష్టంగా చెబుతోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్, రొమాంటిక్ షేడ్ మరోసారి తెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.దర్శకుడు మారుతి ఈ సినిమాతో ప్రభాస్‌లోని కామెడీ, రొమాన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి గట్టిగానే ప్రయత్నించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా హీరోయిన్లతో ప్రభాస్ పండించిన కామెడీ, లవ్ ట్రాక్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని ట్రైలర్ సూచిస్తోంది. కథ పరంగా చూస్తే, ఇది ముందుగా అనుకున్నట్టుగానే హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రం.
ట్రైలర్ ఆధారంగా చూస్తే, ఈ సినిమా మొత్తం నానమ్మ–మనవడి ప్రేమానురాగాల నేపథ్యంలో ముందుకు సాగుతుంది. “నానమ్మ ఈ ప్రపంచంలో అన్నీ మర్చిపోయే జబ్బు ఉన్నా, నువ్వు ఆ ముసలోడిని మాత్రం మర్చిపోవు కదా” అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. అలాగే నానమ్మ ఇచ్చే రెస్పాన్స్ కూడా ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ సీన్స్‌లో ప్రభాస్ చూపించిన ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ మరో లెవెల్‌లో ఉన్నాయి.ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ఎంత ముఖ్యమో, దయ్యం పాత్రలో సంజయ్ దత్ కూడా అంతే కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ – నానమ్మ – సంజయ్ దత్ మధ్య సాగే సన్నివేశాలే కథకు ప్రధాన బలంగా నిలవనున్నాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కథను కూడా చాలామంది ఈజీగా అంచనా వేస్తున్నారు. ప్రభాస్ తాతయ్య ప్రతి విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకునే వ్యక్తి, ముఖ్యంగా తన ఆస్తులపై అపారమైన ప్రేమ ఉన్నవాడు. ఆస్తి విషయంలో ఎవరు జోలికి వచ్చినా వదిలిపెట్టడు. తాతయ్య మరణించిన తర్వాత ఆ ఆస్తిపై ఏమాత్రం ఆశ లేని ప్రభాస్, తన నానమ్మ ఎంతో ఇష్టంగా చూసుకునే ఒక వస్తువు కోసమే ఆ బంగ్లాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ బంగ్లాలో జరిగే అనుకోని సంఘటనలు, అసలు అక్కడ ఏమైంది, తాతయ్య ఎలా చనిపోయాడు అనే మిస్టరీనే కథలో కీలకంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి దర్శకుడు మారుతి ప్రభాస్‌ను మరో కొత్త కోణంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడా లేదా అనేది జనవరి 9న తేలనుంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ మాత్రం విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రభాస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ‘రాజా సాబ్’ ట్రైలర్‌పై మీరు కూడా ఓ లుక్ వేయండి!