టాలీవుడ్ @ 2025 : బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఇవే..!
1. ఓజి (OG) - బాక్సాఫీస్ సునామీ :
ఈ ఏడాది టాలీవుడ్‌ను ఏలిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’. దర్శకుడు సుజిత్ తన స్టైలిష్ మేకింగ్‌తో పవన్‌ను ఒక పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 302 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, 2025లో టాప్ గ్రాసింగ్ తెలుగు చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ మాస్ స్టామినాకు ఈ సినిమా ఒక నిదర్శనం.
2. సంక్రాంతికి వస్తున్నాం - ఫ్యామిలీ విన్నర్ :
సంక్రాంతి పండుగ సీజన్‌ను విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో క్యాష్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. సుమారు రూ. 280 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఈ సినిమా రెండో స్థానాన్ని దక్కించుకుంది. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసింది.
3. గేమ్ ఛేంజర్ : భారీ బడ్జెట్, మిశ్రమ ఫలితం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది మోస్ట్ డిస్కస్డ్ మూవీ. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 197 కోట్ల గ్రాస్ రాబట్టి మూడో స్థానంలో నిలిచింది. అయితే, దిల్ రాజు పెట్టిన భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాల దృష్ట్యా, ఈ వసూళ్లు సినిమాను గట్టెక్కించలేకపోయాయి. ట్రేడ్ వర్గాల్లో ఇది డిజాస్టర్‌గా మిగిలింది.
4. మిరాయ్ - యంగ్ హీరో సంచలనం :
‘హను-మాన్’ తర్వాత తేజ సజ్జా మరోసారి తన బాక్సాఫీస్ సత్తాను చాటారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన సూపర్ హీరో అడ్వెంచర్ ‘మిరాయ్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం రూ. 142 కోట్ల గ్రాస్ వసూళ్లతో నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
5. కుబేర - కంటెంట్ విజయం
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ వంటి ఉద్దండులు కలిసి నటించిన ‘కుభేర’ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రూ. 138 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. మురికివాడలు మరియు ధనవంతుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని శేఖర్ కమ్ముల చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. మొత్తంగా చూస్తే 2025లో పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో నిలవగా, వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేశారు. తేజ సజ్జా వంటి యువ హీరోలు స్టార్ హీరోలకు పోటీనిస్తూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.