సైక్ సిద్దార్థ మూవీ రివ్యూ & రేటింగ్!

Reddy P Rajasekhar

శ్రీ నందు హీరోగా, వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం 'సైక్ సిద్ధార్థ'. జనవరి 1, 2026న నూతన సంవత్సర కానుకగా విడుదలైన ఈ సినిమా, నేటి తరం యువతను టార్గెట్ చేసుకుని తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం శ్రీ నందు ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా ఒకింత భారీ స్థాయిలో జరిగాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

సిద్ధార్థ్ (నందు) జీవితంలో అన్నీ కష్టాలే. ప్రేమించిన అమ్మాయి త్రిష (ప్రియాంక రెబెకా) మోసం చేయడం, డబ్బు, గౌరవం అన్నీ కోల్పోవడంతో జీవితంపై విరక్తి పెంచుకుంటాడు. ఒక బస్తీలో ఉంటూ, ఎవరితో సంబంధం లేకుండా వీడియో గేమ్స్ ఆడుతూ, వింతగా ప్రవర్తిస్తూ అందరికీ తలనొప్పిగా మారుతాడు. ఇలాంటి సమయంలో శ్రావ్య (యామిని భాస్కర్) అనే సింగిల్ మదర్ తన కొడుకుతో కలిసి సిద్ధార్థ్ ఇంటి కింది పోర్షన్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి మధ్య గొడవలతో మొదలైన పరిచయం ఎలా మారింది? సిద్ధార్థ్ తన గతాన్ని మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ :

సిద్ధార్థ్ పాత్రలో నందు అద్భుతంగా నటించాడు. ఒక ఫెయిల్యూర్ యువకుడిగా, సైకో లక్షణాలున్న వ్యక్తిగా అతని బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ బాగున్నాయి. యామిని భాస్కర్ క్యూట్‌గా కనిపించడమే కాకుండా తన పాత్రకు న్యాయం చేసింది. హీరో ఫ్రెండ్ రేవంత్ పాత్రలో నరసింహ కామెడీ టైమింగ్ బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు వరుణ్ రెడ్డి ఈ సినిమాను ఒక 'కామిక్ బుక్' స్టైల్‌లో చాలా కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించారు. ఫంకీ కట్స్,  విజువల్స్ సినిమాకు ఒక విభిన్నమైన లుక్‌ని ఇచ్చాయి. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చాలా ట్రెండీగా ఉన్నాయి.

సమ్రాన్ సాయి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని బాగా ఎలివేట్ చేసింది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్,  క్లైమాక్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.  సినిమాలో బూతు పదాలు, బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది దూరమయ్యే అవకాశం ఉంది. టెక్నికల్‌గా సినిమా స్టైలిష్‌గా ఉన్నా, కథలో అంత డెప్త్ లేదు.  

దర్శకుడు వరుణ్ రెడ్డి తన మేకింగ్‌లో కొత్తదనం చూపించినా, కథనంపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కె. ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ గ్రిట్టీ మూడ్‌ని బాగా క్యారీ చేసింది. ప్రతీక్ నూటి ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది.

'సైక్ సిద్ధార్థ' కేవలం యువతను మరియు ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా. కొత్త రకమైన మేకింగ్, నందు నటన కోసం ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ :  2.5/5.0

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: