ఘంటసాల రివ్యూ.. గాయకుడు కాదు గంధర్వుడు

Reddy P Rajasekhar

దిగ్గజ సంగీత దర్శకుడు, ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల ది గ్రేట్’ అనే సినిమాను సి.హెచ్. రామారావు తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల వారి పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.

కథ
ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) పాట గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మాత్రం చాలా మందికి తెలియని కథను చూపించారు. ఘంటసాల బాల్యం ఎలా గడిచింది? సంగీతాన్ని నేర్చుకునేందుక పడిన పాట్లు ఏంటి? క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందుకు జైలుకి వెళ్లాడు? జైలుకి వెళ్లి వచ్చిన తరువాత ఏం జరిగింది? వీధుల్లో బిక్షం ఎత్తుకుని తిరిగిన రోజుల నుంచి ప్రపంచస్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగారు? జీవిత చరమాంకంలో ఆయన పడిన కష్టాలు ఏంటి? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.

నటీనటులు
బాల నటుడు అతులిత్ ఘంటసాల వారి బాల్యానికి సంబంధించిన పాత్రలో నటించిన చక్కగా నటించాడు. ఘంటసాల వారు యవ్వన, అవసాన దశలో ఎలా ఉండేవారో అలానే ఉన్నాడే అని అనిపించేలా ఇక కృష్ణ చైతన్య అయితే నటించాడు. కృష్ణ చైతన్య ఘంటసాల వారి పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ఘంటసాల సతీమణి పార్వతమ్మగా మృదుల చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. ఓ కీలక పాత్రలో బడే గులాం అలీ ఖాన్‌గా సుమన్ తన పరిధి మేరకు నటించి మెప్పించారు. ఘంటసాల వారి గురువు పట్రాయని సితారామ శాస్త్రిగా సుబ్బరాయ శర్మ, సముద్రాల రాఘవాచారిగా జె.కె. భారవి, ఇంద్రుడి పాత్రలో సాయి కిరణ్, ఘంటసాల తల్లిగా జయ వాణి ఇలా అందరి పాత్రలు బాగుంటాయి.

విశ్లేషణ
దర్శకుడు సి.హెచ్. రామారావు తెలుగు సంగీత దిగ్గజం ఘంటసాల గారి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించాలనే గొప్ప ఆలోచన చేశారు. ఆయన గానం ప్రతి తెలుగువారికి సుపరిచితమే, కానీ తెరవెనుక ఆయన కష్టాలు, వ్యక్తిత్వం గురించి తెలియజేయడం ఈ చిత్రం యొక్క ప్రధాన ఉద్దేశం.

మొదటి భాగంలో ఘంటసాల పడిన కష్టాలు హృదయవిదారకంగా ఉంటాయి. పొట్టకూటి కోసం ఆయన పడిన బాధలు, సంగీత విద్య నేర్చుకునే క్రమంలో అనుభవించిన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను కళ్లకు కట్టారు. ఘంటసాలను వేధించే ఒక పీడకుడి ఎంట్రీతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది, మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

రెండవ భాగం ఆయన వైభోగాన్ని, ప్రఖ్యాతిని, పలుకుబడిని వివరిస్తుంది. లతా మంగేష్కర్ వంటి దిగ్గజాలు ఆయనతో పాడాలని కోరడం, మహ్మద్ రఫీ లాంటి వారు ఆయన గాత్రాన్ని ప్రశంసించే సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. బడే గులాం అలీ ఖాన్‌తో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని చూపించే సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గాత్రం మూగబోవడం, చివరి కోరిక తీరకుండానే స్వర్గస్తులు అవ్వడం వంటి క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసి, హృదయాన్ని బరువెక్కిస్తాయి. ఇక ఇంద్రుడే వచ్చి ఘంటసాలని స్వర్గానికి ఆహ్వానించే సీన్ చూస్తే ఆయన మామూలుగా మనిషి, గాయకుడు కాదని గంధర్వుడు అని అర్థం అవుతుంది.

చిత్రానికి ముఖ్య బలం సంగీతమే. చాలా వరకు ఘంటసాల వారి అసలు పాటలనే ఉపయోగించడం, ఘంటసాల థీమ్ మ్యూజిక్, బడే గులాం అలీ ఖాన్ పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆనాటి కాలానికి తీసుకెళ్తాయి. కెమెరా వర్క్ కూడా పాత కాలాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ మరియు ఆర్ట్ వర్క్ నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడినట్లు కనిపిస్తుంది, ఇది కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

రేటింగ్ 2.75

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: