మ‌న శంక‌ర వరప్రసాద్ ట్రైలర్ మీద ‘మెగా’ ఒత్తిడి చేస్తోందెవ‌రు..?

RAMAKRISHNA S.S.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఎల్లుండి తిరుపతిలో జరగబోతోంది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో ఉన్న అంచనాలు సామాన్యమైనవి కావు. ఇప్పటిదాకా విడుదలైన మూడు పాటలు ఆకట్టుకున్నప్పటికీ, సినిమా అసలు కథేంటి ? చిరంజీవి మార్క్ యాక్షన్ మరియు కామెడీ ఎలా ఉండబోతోంది ? అనే విషయాలపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో చాలా గోప్యత పాటిస్తూ, కేవలం ఎల్లుండి విడుదలయ్యే ట్రైలర్ ద్వారానే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాలని ప్లాన్ చేశారు.


వీడియో కంటెంట్ కోసం ఎదురు చూపులు :
సాధారణంగా పెద్ద సినిమాలకు ముందే టీజర్లు, గ్లింప్స్ విడుదల చేసి హైప్ క్రియేట్ చేస్తారు. ఉదాహరణకు, సంక్రాంతి బరిలో ఉన్న ‘రాజా సాబ్’ ఇప్పటికే 9 నిమిషాల నిడివి గల వీడియో కంటెంట్‌ను ప్రేక్షకులకు చూపించేసింది. కానీ శంకరవరప్రసాద్ గారి విషయంలో అనిల్ రావిపూడి కేవలం పాటలకే పరిమితమై, సినిమా సన్నివేశాలను రివీల్ చేయకుండా పెద్ద రిస్క్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు రాబోయే ఈ ఒక్క ట్రైలర్‌పైనే సినిమా భవితవ్యం, బిజినెస్ రేంజ్ ఆధారపడి ఉన్నాయి.


చిరంజీవి వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్లు దాటిపోయింది. ‘భోళా శంకర్’ తర్వాత ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడం మెగా ఫ్యాన్స్‌ను కొంత అసహనానికి గురిచేసింది. ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ తన సినిమాలతో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద తన ఉనికిని చాటుకుంటున్నారు. ‘అఖండ 2’ తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే, చిరంజీవి తన పాత ఇమేజ్‌ను మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడి ఈ ట్రైలర్‌లో మేజర్ ఎలిమెంట్స్‌ని రివీల్ చేయబోతున్నారు.


చిరంజీవి - నయనతార మధ్య సాగే ప్రేమ, పెళ్లి మరియు ఆ తర్వాత వచ్చే విడాకుల ఘట్టంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని ట్రైలర్ లో ప్రధానంగా చూపించనున్నారట. చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే వింటేజ్ మ్యాజిక్, కామెడీ టైమింగ్ మరియు భారీ యాక్షన్ బిట్స్ ని ట్రైలర్ లో పొందుపరిచారు. విలన్ గ్యాంగ్ తో వచ్చే కాన్‌ఫ్లిక్ట్‌ సీన్లు సినిమా ఇంటెన్సిటీని పెంచేలా ఉంటాయని తెలుస్తోంది.


అనిల్ రావిపూడి తన గత చిత్రాలైన ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ మాదిరిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని మలిచారు. ఎల్లుండి తిరుపతిలో జరిగే ఈ మెగా ఈవెంట్ తో బాక్సాఫీస్ వద్ద ‘ఒక లెక్క’ ప్రారంభం కావడం ఖాయం. ఒకవేళ ట్రైలర్ క్లిక్ అయితే, సంక్రాంతి విజేతగా శంకరవరప్రసాద్ గారు నిలవడం పెద్ద కష్టమేమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: