జన నాయగన్ లో భగవంత్ కేసరి కథ ఎంత.. ఈ తేడాలను మీరు గమనించారా?

Reddy P Rajasekhar

దళపతి విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'జన నాయకుడు' చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే ప్రచారం జోరుగా సాగింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ తొలుత అనిల్ రావిపూడి వద్దకే వెళ్లాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే, 'జన నాయకుడు' కేవలం రీమేక్ మాత్రమే కాదని, ఒక సరికొత్త హంగులతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది.

సినిమా ప్రథమార్థం 'భగవంత్ కేసరి' ఛాయలతో సాగినప్పటికీ, ద్వితీయార్థంలో దర్శకుడు భారీ మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో రాజీ పడకుండా రాకెట్ లాంచర్లు, అధునాతన డ్రోన్లతో సాగే ఫైట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్ విలువలతో ఈ పోరాట ఘట్టాలను వెండితెరపై ఆవిష్కరించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. యాక్షన్ ప్రియులకు ఈ సెకండాఫ్ ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోందని సినీ వర్గాల భోగట్టా.

మరోవైపు, కథలో అంతర్లీనంగా ఉన్న భావోద్వేగాలను దర్శకుడు ఎంతో చాకచక్యంగా తెరకెక్కించారు. ఒక అమ్మాయి ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను దేశవ్యాప్త సమస్యగా మలిచిన తీరు, దాని వెనుక ఉన్న పొలిటికల్ డ్రామా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. విజ్జి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథలో సామాజిక బాధ్యతను గుర్తు చేసే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక బలమైన సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందించబోతున్నారు.

అంతేకాకుండా విజయ్ రాబోయే రాజకీయ ప్రస్థానానికి ఊతమిచ్చేలా కొన్ని కీలక సన్నివేశాలను, డైలాగులను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ పొలిటికల్ ఎలిమెంట్స్‌ను జోడించడం వల్ల ఆయన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఈ మార్పులు చూస్తుంటే కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు ఈ కథను మలిచాడని అర్థమవుతోంది. మరి ఈ విభిన్న ప్రయత్నంతో 'జన నాయకుడు' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: