జ‌ననాయ‌కుడు: బాల‌య్య భ‌గ‌వంత్‌కు మార్పులు, చేర్పులు ఇలా..!

RAMAKRISHNA S.S.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదలైనా నుంచి తెలుగు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను విశ్లేషిస్తే, ఇందులో ‘భగవంత్ కేసరి’ టచ్ ఉన్నప్పటికీ, కథలో కీలక మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. ‘జన నాయగన్’ ట్రైలర్ మరియు ‘భగవంత్ కేసరి’కి మధ్య ఉన్న పోలికలు, తేడాలు చాలానే ఉన్నాయి.


‘భగవంత్ కేసరి’ పోలికలు :
ట్రైలర్ చూసిన ఎవరికైనా కొన్ని అంశాలు వెంటనే బాలయ్య సినిమాను గుర్తుకు తెస్తాయి ‘భగవంత్ కేసరి’లో చిన్నాన్న (బాలయ్య) - కూతురు వరసైన అమ్మాయి (శ్రీలీల) మధ్య ఉండే బంధం కథకు ప్రాణం. ‘జన నాయగన్’లో కూడా విజయ్ ఒక అమ్మాయికి అండగా నిలబడటం, ఆమెను ఒక లక్ష్యం వైపు నడిపించడం వంటి అంశాలు ‘భగవంత్ కేసరి’ తరహాలోనే ఉన్నాయి. ప్రత్యర్థులను ఎదుర్కొనే విధానం, విలన్ సెటప్ వంటివి అనిల్ రావిపూడి మార్క్ యాక్షన్ డ్రామాను పోలి ఉన్నాయి.


ఇది పక్కా రీమేక్ కాదని, కేవలం ఆ కథలోని సోల్ మాత్రమే తీసుకున్నారని అర్థమవుతోంది. విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్న తరుణంలో, దర్శకుడు హెచ్. వినోద్ ఈ కథకు పూర్తిస్థాయి రాజకీయ రంగు పులిమారు. ‘భగవంత్ కేసరి’లో రాజకీయం కంటే వ్యక్తిగత పగ, మహిళా సాధికారతపై దృష్టి పెట్టగా.. ‘జన నాయగన్’లో వ్యవస్థను మార్చడం, రాజకీయ పోరాటం వంటి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.


హెచ్. వినోద్ మార్క్: వినోద్ సినిమాలు సాధారణంగా వాస్తవికతకు దగ్గరగా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతాయి. ‘భగవంత్ కేసరి’లోని కమర్షియల్ కామెడీ కంటే, ఇందులో సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాబీ డియోల్ పాత్రను డిజైన్ చేసిన తీరు ‘భగవంత్ కేసరి’లో అర్జున్ రాంపాల్ పాత్ర కంటే భిన్నంగా, మరింత పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. తమిళ ప్రేక్షకుల అభిరుచికి మరియు విజయ్ పొలిటికల్ ఇమేజ్‌కు అనుగుణంగా కథలో దాదాపు 40-50 శాతం మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇది ‘భగవంత్ కేసరి’ టచ్ ఉన్న ఒక కొత్త పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా విజయ్ కేవలం ఒక హిట్ మాత్రమే కాకుండా, ప్రజల్లోకి ఒక బలమైన సందేశాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారు. జనవరి 9న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో బాలయ్య సినిమాను చూసిన ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: