ఏపీలో మళ్లీ బీఆర్ఎస్ యాక్టివ్ అవుతోందా... ?
తోట చంద్రశేఖర్ ఒక మాజీ సివిల్ సర్వీస్ అధికారి. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఆయన వ్యాపార ప్రస్థానం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన పలు ప్రాజెక్టులపై కొన్ని ఆరోపణలు వచ్చాయి.చంద్రశేఖర్ రాజకీయ ప్రస్థానం ఎంతో విచిత్రంగా సాగింది. తన వ్యాపార అక్రమాలను కాపాడుకోవడానికి రాజకీయ అండదండలు అవసరమని భావించి ఆయన పలు పార్టీలు మారుతూ వచ్చారు. మొదట చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన, ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ కూడా ఇమడలేక జనసేనలోకి వెళ్లారు. చివరకు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆయన కొంతకాలం కనుమరుగయ్యారు.
ప్రస్తుతం ఈ కొత్త ఛానల్ ద్వారా ఏపీలో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని తోట చంద్రశేఖర్ భావిస్తున్నారు. తన మీడియా సంస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి వేదికగా మార్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అండదండలతో సాగుతున్న ఈ మీడియా ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. రాబోయే రోజుల్లో 99TV ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ? బాధ్యతాయుతమైన జర్నలిజం చేస్తుందో లేదో చూడాలి.