సంక్రాంతికి శర్వానంద్ సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడే... ?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి అంటేనే భారీ చిత్రాల సందడి కనిపిస్తుంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పోటీ ఎంతో తీవ్రంగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు బరిలో ఉన్నా.. యంగ్ హీరో శర్వానంద్ తన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో బరిలోకి దిగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వెనుక శర్వానంద్ ఎంతో ధైర్యంగా ఉండటానికి బలమైన కారణాలే ఉన్నాయి. గతంలో పండుగ సీజన్లలో మంచి విజయాలు అందుకున్న ట్రాక్ రికార్డ్ ఉండటంతో, ఈ సారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించవచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
పెద్ద సినిమాల పోటీ మధ్య థియేటర్ల కేటాయింపు ఒక సమస్య అయితే, టికెట్ ధరల పెంపు ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా అడ్డుకునే మరో ప్రధాన అంశం. పండుగ సమయాల్లో మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఆర్థిక ఇబ్బందిని గమనించిన శర్వానంద్ బృందం ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. తమ సినిమా టికెట్లను ఎలాంటి అదనపు పెంపు లేకుండా కేవలం సాధారణ ఎంఆర్పీ ధరలకే అందుబాటులో ఉంచుతున్నట్లు శర్వానంద్ సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా కంటెంట్ విషయానికి వస్తే శర్వానంద్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు. ‘నారీ నారీ నడుమ మురారి’ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. హిలేరియస్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సాక్షి వైద్య అలాగే సంయుక్తా మీనన్ గ్లామర్ యువతను ఆకట్టుకునేలా ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఒక స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రంగా ఉండబోతోంది. ఇద్దరు అందమైన భామల మధ్య చిక్కుకున్న ఒక యువకుడి తిప్పలను దర్శకుడు ఎంతో సరదాగా మలిచారు. ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పటికే చార్ట్బస్టర్లుగా నిలిచాయి. ఈ సంక్రాంతికి శర్వానంద్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఈ ‘నారీ నారీ నడుమ మురారి’ ఒక పర్ఫెక్ట్ ట్రీట్ కానుంది.