అన్ని సినిమాలూ హిట్లే... థియేటర్లు సరిపోవట్లేదు బాబోయ్... !
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వేళ థియేటర్ల వద్ద అనూహ్యమైన సందడి నెలకొంది. పండగ సెలవుల కారణంగా ప్రేక్షకుల తాకిడి పెరగడంతో ప్రదర్శనలు చాలక పంపిణీదారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ స్పందన రావడంతో కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కేటాయించిన స్క్రీన్లు ప్రస్తుత డిమాండ్‌కు ఏమాత్రం సరిపోవడం లేదు. ఆన్‌లైన్ బుకింగ్స్ తో పాటు కౌంటర్ల వద్ద కూడా టిక్కెట్ల కోసం జనం ఎగబడుతుండటంతో రెండు మూడు రోజులకు ముందే హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోవడానికి అదనపు షోలు వేసేందుకు వీలు లేక థియేటర్ల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.
మరోవైపు ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోయినా.. ఆ సినిమా కోసం చేసుకున్న ఒప్పందాలు అడ్డంకిగా మారాయి. భారీ లక్ష్యాలతో విడుదలైన ఈ సినిమాను థియేటర్ల నుంచి ఇప్పుడప్పుడే తొలగించడం పంపిణీదారులకు సాధ్యం కావడం లేదు. రెండో వారం ప్రవేశిస్తే తప్ప స్క్రీన్ల సర్దుబాటులో మార్పులు రావని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు మెల్లగా టాక్ పెరుగుతోంది. గత సినిమాల ప్రభావం కొంత ఉన్నప్పటికీ, పండగ వాతావరణం మాస్ మహారాజా సినిమాకు కలిసి వస్తోంది. అలాగే కొత్తగా విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రం కూడా బాక్సాఫీస్ రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
పోటీ ఇక్కడితో ఆగిపోలేదు. సాయంత్రం నుంచి శర్వానంద్ నారి నారి నడుమ మురారి షోలు ప్రారంభం కానుండటంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ సినిమాకు కూడా హిట్ టాక్ వచ్చింది. ఆదివారం వరకు పాఠశాలలకు సెలవులు ఉండటం, సొంత ఊర్లకు వెళ్లిన వారు వినోదం కోసం సినిమా థియేటర్లనే ప్రధాన వేదికగా ఎంచుకోవడంతో రద్దీ ఎక్కువుగా ఉంది. ఉత్తరాంధ్రతో పాటు నైజాం ప్రాంతాల్లో థియేటర్ల వద్ద జనసందోహం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేక్షకులకు ఏ సినిమా చూపించాలో, ఏ సినిమాకు ఎన్ని స్క్రీన్లు కేటాయించాలో తెలియక డిస్ట్రిబ్యూటర్లు సందిగ్ధంలో పడిపోయారు.
ప్రస్తుత సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల మధ్య నెలకొన్న పోటీ పంపిణీదారుల మధ్య అంతర్గత వివాదాలకు దారి తీస్తోంది. తమ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు, టాక్ బాగున్న చిత్రాలకు స్క్రీన్లు పెంచాలని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈ గొడవలు పక్కన పెడితే ప్రస్తుతానికి మన శంకరవరప్రసాద్ గారు సినిమా అగ్రస్థానంలో నిలిచినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన స్థానాల కోసం ఇతర చిత్రాలు గట్టిగానే పోరాడుతున్నాయి. పండగ సీజన్ ముగిసేలోపు ఏ సినిమా ఎంత వసూలు చేస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. థియేటర్ల కొరత సమస్యను అధిగమించి ప్రేక్షకులను సంతృప్తి పరచడం ఇప్పుడు సినీ వర్గాలకు పెద్ద సవాలుగా మారింది.