బాల‌య్య స‌మ‌ర‌సింహారెడ్డితో పోటీప‌డి చిత్త‌యిన చిరు, రాజ‌శేఖ‌ర్‌, కృష్ణ‌, సుమ‌న్ సినిమాలు...!

RAMAKRISHNA S.S.
నందమూరి నటసింహం బాలకృష్ణకు సంక్రాంతి పండుగ ఎంతో ఇష్టమైన సీజన్. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో దిగి భారీ విజయాలు అందుకున్నాయి. అయితే 1999 సంవత్సరంలో విడుదలైన 'సమరసింహారెడ్డి' సృష్టించిన ప్రభంజనం టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతం. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాక్షన్ కథా చిత్రాలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. జనవరి 13న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అక్షరాలా సునామీ సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లోనే సుమారు 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఈ చిత్రం ఏకంగా 72 కేంద్రాలలో వంద రోజులు ఆడి రికార్డు నెలకొల్పింది.


బాలయ్య 'సమరసింహారెడ్డి' ధాటికి ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఇతర హీరోల సినిమాలు విలవిలలాడాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా రాణిస్తున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సైతం బాలయ్య దెబ్బకు తలవంచక తప్పలేదు. రాజశేఖర్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన 'నేటి గాంధీ' సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. జనవరి 8న విడుదలైన ఈ చిత్రం ప్రారంభంలో కొంతమేర పర్వాలేదనిపించినా, సమరసింహారెడ్డి థియేటర్లలోకి వచ్చిన తర్వాత తన ఉనికిని కోల్పోయింది. చివరకు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజశేఖర్ కెరీర్ లో ఒక వైవిధ్యమైన ప్రయత్నం బాలయ్య మాస్ దెబ్బతో అడ్రస్ లేకుండా పోయింది.


ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన 'మానవుడు దానవుడు' సినిమా కూడా సంక్రాంతి రేసులో నిలిచింది. సౌందర్య, రమ్యకృష్ణ వంటి అగ్ర హీరోయిన్లు ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. జనవరి 14న విడుదలైన ఈ మూవీ మొదటి ఆట నుండే ప్రతికూల స్పందనను ఎదుర్కొంది. కృష్ణ చేసిన ఈ వినూత్న ప్రయోగం సమరసింహారెడ్డి మేనియాలో కొట్టుకుపోయింది. పాత తరం సూపర్ స్టార్ సినిమా అయినప్పటికీ కనీస వసూళ్లు రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది. బాలయ్య నట ప్రతాపం ముందు కృష్ణ వంటి దిగ్గజ హీరో సినిమా కూడా నిలబడలేకపోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.


వీరితో పాటు సుమన్ నటించిన 'పెద్ద మనుషులు' సినిమా కూడా అదే రోజు విడుదలైనప్పటికీ ప్రభావం చూపలేకపోయింది. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. అటు శ్రీహరి హీరోగా వచ్చిన 'తెలంగాణ' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక జ‌న‌వ‌రి 1న రిలీజ్ అయిన మెగాస్టార్ స్నేహంకోసం సినిమా సైతం స‌మ‌ర‌సింహారెడ్డి దూకుడుకు యావ‌రేజ్‌గా నిలిచిపోయింది. ఇలా సమరసింహారెడ్డి అనే ఒక్క సినిమా ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన కృష్ణ, రాజశేఖర్, సుమన్ వంటి హీరోల సినిమాలు నిల‌దొక్కుకోలేక‌పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: