లోకేష్ కనగరాజ్ టార్గెట్ అయ్యాడే.. తీవ్ర విమర్శలు ...?
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రతిభావంతమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్. అతి తక్కువ కాలంలోనే స్టార్ దర్శకుడిగా ఎదిగిన ఆయన, తనకంటూ ఒక ప్రత్యేకమైన 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) సృష్టించుకుని సంచలనం సృష్టించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో లోకేష్ ఒక భారీ ప్రాజెక్ట్ ఖరారు చేయడం భారతీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'AA23' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సంక్రాంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై తెలుగు ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నప్పటికీ, తమిళ సినీ అభిమానులు మాత్రం లోకేష్ కనగరాజ్ పై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ ప్రేక్షకులలో లోకేష్ కనగరాజ్ పట్ల అసంతృప్తి పెరగడానికి ప్రధాన కారణం ఆయన తన పాత ప్రాజెక్టులను పక్కన పెట్టడమేనని తెలుస్తోంది. కార్తీ హీరోగా వచ్చిన 'ఖైదీ' సినిమా లోకేష్ కు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ముగింపులో ఇచ్చిన హింట్ ప్రకారం 'ఖైదీ 2' ఎప్పుడు వస్తుందా అని అభిమానులు గత ఐదేళ్లుగా కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం వరుసగా విజయ్ తో 'మాస్టర్', 'లియో', కమల్ హాసన్ తో 'విక్రమ్', రజనీకాంత్ తో 'కూలీ' అంటూ అగ్ర హీరోల వెంట వెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెడితే, కార్తీ 'ఖైదీ 2' మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తమిళ ఆడియెన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా లోకేష్ పై విమర్శల వర్షం కురుస్తోంది. లోకేష్ కు ఇంతటి స్థాయిని కల్పించిన 'ఖైదీ' వంటి సీక్వెల్స్ పూర్తి చేయకుండా, ఇతర భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని వారు తీవ్రంగా మండిపడుతున్నారు.ఇక ఐకాన్ స్టార్ తో సినిమా అనౌన్స్ మెంట్ వీడియో గమనిస్తే, ఇది ఒక సరికొత్త వెస్ట్రన్ డ్రామాగా ఉండేలా కనిపిస్తోంది, అంటే ఇది ఎల్‌సీయూ లో భాగం కాకపోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్నట్లు వెల్లడించారు. లోకేష్ తన డైరీని సరిగ్గా ప్లాన్ చేసుకుని ఖైదీ 2 పనులు కూడా సమాంతరంగా చేపడితే తప్ప ఈ వివాదం సద్దుమణిగేలా లేదు.