మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌కు నిజంగానే బిగ్ రిలీఫ్ ... !
దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను భారీ ప్రయోగాలు లేకుండా సింపుల్ కామెడీ ఎంటర్టైనర్‌గా మలిచారు. భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయే సగటు వ్యక్తి పాత్రలో రవితేజ తనదైన శైలిలో నటించారు. నేటి కాలానికి తగిన ట్రెండీ కామెడీని జోడించడంతో మాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సునీల్, సత్య పండించిన హాస్యం థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది. పాత చిత్రాల వైఫల్యాలను మర్చిపోయేలా ఈ సినిమా రవితేజ కెరీర్ గ్రాఫ్‌ను మళ్లీ గాడిలో పెట్టింది. బుక్ మై షో ట్రెండింగ్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఈ మూవీ పూర్తి స్థాయి లాభాలను సాధించడానికి మరో పది రోజుల టైం పట్టే ఛాన్స్ ఉంది.
రవితేజ తదుపరి ప్రాజెక్టుల మీద ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ రవితేజలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనుందని సమాచారం. ఈ సినిమాకు 'ఇరుముడి' అనే టైటిల్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇందులో రొటీన్ ప్రేమ పాటలు, అతిగా అనిపించే కామెడీ ఉండదని టాక్ ? సీరియస్ జానర్‌లో సాగుతూనే రవితేజ మార్కు మాస్ అంశాలు మిస్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడుతున్నారట. రవితేజ పొటెన్షియల్‌ను పూర్తిగా వాడుకునే కథ ఇదేనని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవికి 'మన శంకర వరప్రసాద్ గారు' ఎంతటి ఘనవిజయాన్ని అందించిందో రవితేజకు కూడా అలాంటి ఒక బలమైన కథ పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడితో 'రాజా ది గ్రేట్' సీక్వెల్ చేయాలని ఫ్యాన్స్ అడుగుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. అంధుడి పాత్రను మళ్లీ పోషించడం కంటే రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే సరికొత్త సబ్జెక్టుతో వస్తేనే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విక్రమార్కుడు, కిక్ లాంటి సెన్సేషనల్ హిట్స్ మాస్ రాజా నుంచి ఎప్పుడు వస్తాయా అని ఇండస్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. రవితేజ తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాయాలని కోరుకుందాం.