ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్.. అమెరికాలో ‘రాజు’ హవా!
నవీన్ పోలిశెట్టికి ఓవర్సీస్ మార్కెట్లో ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. 'జాతి రత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాల తర్వాత వరుసగా మూడోసారి యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్ల మార్కును కేవలం 4 రోజుల్లోనే దాటేసి హ్యాట్రిక్ సాధించాడు.తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే $1.2 మిలియన్ మార్కును అధిగమించి, $2 మిలియన్ల దిశగా వేగంగా దూసుకుపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ₹100.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, నవీన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.అమెరికాలో ఉండే తెలుగు కుటుంబాలకు నవీన్ పోలిశెట్టి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. దానికి తోడు ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.తనదైన కామెడీ టైమింగ్, పక్కా గోదావరి యాసతో నవీన్ చేసిన హంగామా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ముఖ్యంగా "భీమవరం బ్రాంచ్ ఆఫ్ గోవా" అంటూ ఆయన చేసే కామెడీకి యూత్ ఫిదా అవుతున్నారు. దర్శకుడు మారి ఈ చిత్రాన్ని ఎలాంటి అసభ్యత లేకుండా, పక్కా క్లీన్ కామెడీతో తెరకెక్కించారు. దీనివల్ల అమెరికాలో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్లకు క్యూ కడుతున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్ మరియు ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. రావు రమేష్ మార్క్ కామెడీ కూడా బాగా పండింది.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రం విడుదలైన కేవలం 4 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ప్రవేశించారు. నేటి కాలంలో ఒక సినిమా ఇంత వేగంగా ప్రాఫిట్స్ జోన్లోకి రావడం ఒక అద్భుతమనే చెప్పాలి.మొత్తానికి 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి అసలైన విజేతగా నిలిచింది. పెద్ద సినిమాల హోరులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని, అమెరికాలో 'రాజు' అనిపించుకున్నాడు నవీన్. 100 కోట్ల క్లబ్లో చేరడంతో నవీన్ పోలిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఈ రన్ ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయం!