40లలో తల్లులుగా సెలబ్రిటీస్.. ప్రెగ్నెన్సీ సురక్షితమేనా..?
అమెరికా ఉపాధ్యక్షుడుగా ఉన్నజేడి వాన్స్-ఉషా 2014లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఇప్పటికే వివేక్, మిరాబెల్, ఇవాన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఏడాది జులైలో వారు నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.. అది కూడా భర్త పదవిలో ఉండగా 40 ఏళ్ల వయసులో గర్భవతి అయిన మొదటి అమెరికా సెకండ్ లేడీగా నిలిచింది ఉషా వాన్స్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన కత్రినా కైఫ్ 42 ఏళ్ల వయసులో కొడుకుకి జన్మనిచ్చింది. అలాగే మరో ఒక హాస్యనటి భారతి సింగ్ తన 41వ ఏట రెండవ బిడ్డకు స్వాగతం పలకబోతున్నట్లు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇంతటి ఏజ్ లో అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న వీరికి వయసురీత్యా ఆరోగ్య ప్రమాదాలేమి ఎదురు కావా? అంటే అలాంటి వాటికి కాలం చెల్లిపోయిందని నిపుణులు చెబుతున్నారు.
ఇంత లేటు వయసులో గర్భం దాల్చడం అనేది కూడా ఇకమీదట ప్రమాదకరం కాకపోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది మహిళలు తమ ప్రగ్నెన్సీ విషయంలో ఎన్నో జాగ్రత్తలతో సానుకూలత ఫలితాలను పొందుతున్నారని తెలిపారు. ఇంతటి లేటు వయసులో పిల్లల్ని కనడం కష్టం, అంతేకాకుండా అండాల నాణ్యత తగ్గి సంతాన ఉత్పత్తి సహజంగానే తగ్గుతుందని, ఇలాంటి సమయాలలో ఐవిఎఫ్ వంటి వాటిని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.
35 ఏళ్లు దాటిన మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆ వయసులో గర్భధారణ అనేది మధుమేహం, రక్తపోటు మరికొన్ని అనారోగ్య ప్రమాదాలను పెంచుతుందని, పైగా ప్రసవ సమయంలో కొన్ని సమస్యల వల్ల సిజరిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఏజ్ లో (వృద్ధ తల్లులు) జన్మించిన శిశువులు సైతం డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోన్ అసాధారణతలు వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాలలో నెలలు నిండకుండానే జన్మించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
ఇలాంటి లేటు వయసులో ప్రెగ్నెన్సీ అయినవారు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే కుటుంబం మద్దతు ఉండాలి ,ఒత్తిడి లేకుండా చూసుకోవాలి అప్పుడే తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.