స్క్రిప్ట్ నుంచి ప్రమోషన్ వరకూ పక్కా ప్లానింగ్.. ఈ ముగ్గురి లెక్కే వేరు!

Amruth kumar
టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు హీరోలంటే కేవలం కెమెరా ముందుకు వచ్చి యాక్షన్, డ్యాన్స్ చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ హీరోలు మాత్రం కేవలం నటులే కాదు.. స్టోరీ సృష్టికర్తలు కూడా! అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారు తమ సినిమాలకు స్క్రిప్ట్ రాయడమే కాకుండా, బడ్జెట్ మరియు మేకింగ్ విషయంలో కూడా వేలు పెడుతూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.టాలీవుడ్‌లో ఇప్పుడు 'మల్టీ టాలెంటెడ్' హీరోల హవా నడుస్తోంది. నటనతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తూ సినిమాను ఏ రేంజ్ లో మార్చాలో వీరు పక్కా లెక్కలతో ఉన్నారు. కేవలం దర్శకుడి మీద ఆధారపడకుండా, సినిమా అవుట్‌పుట్ విషయంలో ప్రతి అడుగులోనూ భాగస్వాములవుతూ వీరు సక్సెస్ మంత్రను అందుకుంటున్నారు.



అడివి శేష్:
అడివి శేష్ అంటేనే ఒక బ్రాండ్. ఆయన నటించిన 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్' వంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. శేష్ కేవలం హీరో మాత్రమే కాదు, ఈ సినిమాలన్నింటికీ ఆయనే కథా రచయిత. రీసెంట్‌గా విడుదలైన 'మేజర్' సినిమాకు ఆయన రాసిన కథ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.తక్కువ బడ్జెట్‌లో గ్రాండ్ లుక్ ఎలా తీసుకురావాలో శేష్‌కు బాగా తెలుసు. ప్రస్తుతం ఆయన రాస్తున్న 'జీ2 (గూఢచారి 2)' మరియు 'డాకోయిట్' చిత్రాలు టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేయబోతున్నాయి.



సిద్ధు జొన్నలగడ్డ:
'డీజే టిల్లు' అనే ఒక్క సినిమాతో టాలీవుడ్ యూత్‌ను తన వైపు తిప్పుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు క్యారెక్టర్ అంత హిట్ అయిందంటే దానికి కారణం సిద్ధు రాసిన డైలాగులే. 'డీజే టిల్లు' మరియు 'టిల్లు స్క్వేర్' సినిమాలకు సిద్ధు స్వయంగా డైలాగులు రాశారు. సికింద్రాబాద్ మాస్ యాసను ఆయన పలికించిన తీరు థియేటర్లలో ఈలలు వేయించింది. సినిమా షూటింగ్ సమయంలో కూడా సీన్ ఇంపాక్ట్ కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేయడంలో సిద్ధు సిద్ధహస్తుడు. అందుకే ఆయన సినిమాల్లో కామెడీ పీక్స్‌లో ఉంటుంది.



నవీన్ పొలిశెట్టి:
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి, కేవలం కామెడీ టైమింగ్‌కే పరిమితం కాలేదు. తన మొదటి సినిమా 'ఏజెంట్' కు నవీన్ కో-రైటర్‌గా పనిచేశారు. అందులోని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ ఆయన పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి.ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంలో నవీన్ ఇన్ పుట్స్ చాలా ఉన్నాయని టాక్. ప్రస్తుతం ఆయన సక్సెస్ అందుకున్న'అనగనగా ఒక రాజు' చిత్రానికి కూడా స్క్రిప్ట్ వర్క్‌లో భాగస్వామిగా ఉన్నాడు.



ఈ హీరోలు ఇలా స్క్రిప్ట్ మరియు మేకింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రధాన కారణం 'క్వాలిటీ కంట్రోల్'. హీరోలే కథలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ తగ్గించాలో క్లారిటీ ఉంటుంది.ఈ తరం హీరోలకు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో బాగా తెలుసు. అందుకే రొటీన్ మాస్ సినిమాల కంటే, డిఫరెంట్ స్క్రిప్ట్‌లకే వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా గెలిస్తే క్రెడిట్ వీరికి దక్కుతుంది, ఒకవేళ ఫెయిల్ అయితే ఆ బాధ్యత కూడా వీరే తీసుకుంటారు.టాలీవుడ్‌లో ఇప్పుడు దర్శకుడి విజన్ కి హీరోల క్రియేటివిటీ తోడవుతోంది. అడివి శేష్ థ్రిల్లర్స్, సిద్ధు మాస్ కామెడీ, నవీన్ హ్యూమర్.. ఇవన్నీ వీరి స్వయంకృషితో వచ్చినవే. నటుడిగా రాణిస్తూనే, తెర వెనుక కూడా తమ ముద్ర వేస్తున్న ఈ హీరోలు భవిష్యత్ టాలీవుడ్‌ను శాసించడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: