తెలంగాణలో టికెట్ రేట్ల విషయంలో అలా చేయబోతున్నారా.. ఆ సమస్యలకు చెక్!

Reddy P Rajasekhar

ఈ మధ్యకాలంలో తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు అంశం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో అదనపు ధరలు వసూలు చేయడంపై అభిమానులు, ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ది రాజాసాబ్, అలాగే మన శంకర వరప్రసాద్ వంటి సినిమాల టికెట్ రేట్ల పెంపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టికెట్ రేట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానమే వినిపిస్తోంది.

ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల ప్రకారం, సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే కనీసం మూడు నెలల ముందే అనుమతి కోరాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ నెలలోపు విడుదలయ్యే సినిమాలకు అదనపు టికెట్ రేట్లు అమలయ్యే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పవచ్చు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

అయితే రాబోయే రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది వంటి సినిమాలకు మాత్రం టికెట్ రేట్ల పెంపు అవసరం ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు విడివిడిగా ప్రత్యేక అనుమతులు తీసుకునే కంటే, మొత్తం టికెట్ రేట్ల నిర్మాణాన్నే సవరించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ రాజకీయ నేతలను కలిసి చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తే, తరచూ ఎదురవుతున్న టికెట్ రేట్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం–చలనచిత్ర పరిశ్రమ మధ్య త్వరలోనే అధికారిక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. ఈ చర్చల ఫలితమే భవిష్యత్తులో తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల దిశను నిర్ణయించనుందని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాబోయే రోజుల్లో టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: