2026 సంవత్సరంలో మెగా హీరోల హవా.. ఆ సినిమాలతో అదరగొట్టనున్నారా?

Reddy P Rajasekhar

2026 సంవత్సరం టాలీవుడ్‌లో ‘మెగా’ నామ సంవత్సరంగా మారిపోనుంది. మెగా కుటుంబానికి చెందిన అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు అందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవ్వడంతో అభిమానుల్లో అప్పుడే పండగ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, చిరు మార్క్ వినోదాన్ని పండించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే మెగాస్టార్ తన తర్వాతి సోషియో-ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’ను కూడా ఇదే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ బిజీలో ఉంటూనే సినిమా పనులను వేగవంతం చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, మార్చి చివరలో ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ వంటి హిట్టు తర్వాత వస్తున్న ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే టైటిల్‌తో ఒక విభిన్నమైన రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని, ముఖ్యంగా ఆయన లుక్ మరియు మేకోవర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

యువ హీరోల్లో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగంతో వస్తున్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ అనే ఇండో-కొరియన్ హారర్ కామెడీలో వరుణ్ నటిస్తున్నారు. ఇది టాలీవుడ్‌లో మొదటిసారిగా వస్తున్న విభిన్నమైన కాన్సెప్ట్ కావడం విశేషం. వీరందరితో పాటు సాయి దుర్గా తేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా కూడా ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా వరుస సినిమాలతో మెగా హీరోలు థియేటర్ల వద్ద దండయాత్రకు సిద్ధమవ్వడంతో, 2026 మెగా ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఇయర్‌గా నిలవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: