మెగా వారసుడి విషయంలో వింత వాదన.. మరీ ఓవర్ చేస్తున్నారే..?
అయితే ఈ సంబరాలే ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. మెగా వారసుడి జననం సందర్భంగా జరిగిన ఈ సెలబ్రేషన్స్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నెట్టింట రెండు వర్గాలుగా చీలిపోయి తీవ్ర చర్చ సాగుతోంది.ఒక వర్గం మాత్రం ఈ సంబరాలను తీవ్రంగా విమర్శిస్తోంది. “ఆసుపత్రి అనేది ప్రశాంతత అవసరమైన ప్రదేశం. అక్కడ ‘డోంట్ సౌండ్ హార్న్’ అనే బోర్డులు స్పష్టంగా ఉంటాయి. అలాంటి చోట పటాకులు కాల్చడం ఎంతవరకు సమంజసం?” అంటూ ప్రశ్నిస్తోంది. రోగులు, వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్న ప్రాంతంలో ఇలాంటి హంగామా సరికాదని అభిప్రాయపడుతోంది. కొందరైతే అభిమానులు హద్దులు దాటారని, సెలబ్రిటీ పిచ్చితో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీనికి ప్రతిగా మరో వర్గం బలంగా స్పందిస్తోంది. “ఇది అభిమానుల ఆనందం. తమ అభిమాన హీరో ఇంట వారసుడు పుట్టిన సందర్భంలో సంబరాలు చేసుకోవడం సహజం. ఇందులో తప్పేముంది?” అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఆసుపత్రి నిర్మాణం ముప్పై ఏళ్ల క్రితం జరిగిందని, అప్పట్లో ఆ ప్రాంతంలో జనావాసాలు లేవని, కానీ ఇప్పుడు చుట్టూ లక్షల ఇళ్లు ఏర్పడ్డాయని గుర్తు చేస్తోంది. “దీపావళి, వినాయక చవితి, నూతన సంవత్సరం వంటి పండుగల సమయంలో ఇదే ప్రాంతంలో పటాకులు కాల్చుతుంటే ఎవరు ప్రశ్నిస్తారు? అప్పుడు ఇబ్బంది గుర్తుకురాదా?” అంటూ కౌంటర్ ఇస్తోంది.“ఇది అభిమానులకు ఒక పండుగ లాంటిది. దీపావళి ఒక్కరోజే వస్తే, మెగా వారసుడి జననం జీవితంలో ఒక్కసారే వస్తుంది. అభిమానులకే కాదు, వారి శ్రేయోభిలాషులకూ ఇది దీపావళి లాంటి సందర్భమే” అని ఈ వర్గం అభిప్రాయపడుతోంది. కొందరైతే మెగా కుటుంబంపై ద్వేషం ఉన్నవారే ఈ విషయాన్ని అవసరానికి మించి పెద్దది చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ సంబరాలను చూసి మెగా కుటుంబాన్ని ఇష్టపడని కొందరు తీవ్ర అసహనానికి గురవుతున్నారని, ఎదుటివారి ఆనందాన్ని, ఎదుగుదలను సహించలేని మనస్తత్వమే ఈ విమర్శలకు కారణమని అభిమానులు అంటున్నారు. ఆనందాన్ని కూడా రాజకీయంగా లేదా వ్యక్తిగత ద్వేషంతో చూడటం సరైంది కాదని వారు వాపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ & శ్రేయోభిలాషులు వర్సెస్ సోషల్ మీడియా కామెంటేటర్స్ అనే స్థాయిలో వాగ్వాదం కొనసాగుతోంది. ఒక చిన్నారి జననం ఆనందంగా జరగాల్సిన సందర్భంలో, అది అనవసరమైన వివాదంగా మారడం పట్ల కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా, మెగా ఇంట మరోసారి పండుగ వాతావరణం నెలకొనడం నిజం. ఈ శుభసందర్భాన్ని ఆనందంగా తీసుకోవాలా? లేక విమర్శలతో మసకబార్చాలా? అన్నది ప్రతి ఒక్కరి దృక్పథంపై ఆధారపడి ఉందని చెప్పొచ్చు.