బరాబర్ ప్రేమిస్తా రివ్యూ.. సక్సెస్ కొట్టిన చంద్రహాస్

Reddy P Rajasekhar

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా, సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘బరాబర్ ప్రేమిస్తా’. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిత్రం, నేడు థియేటర్లలోకి వచ్చింది. సిసి క్రియేషన్స్ మరియు ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకాలపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం

కథ:

రుద్రారం గ్రామంలో కర్మాన, ధర్మాన అనే రెండు వర్గాల మధ్య తరతరాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఉంది. ముఖ్యంగా 80, 90వ దశకాల్లో ఈ కుల వివక్ష కారణంగా ఓ ప్రేమ జంట విఫలమవ్వడం, ఆపై ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్య చేసుకోవడం ఆ ఊరిలో చెరగని ముద్ర వేసింది.

అలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్యే వేర్వేరు వర్గాలకు చెందిన చందు (చంద్రహాస్), బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఊర్లో తమ ప్రేమను అంగీకరించరని తెలిసి వారు కేరళకు పారిపోతారు. అయితే కేరళకు వెళ్లిన వారికి అక్కడ ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? అంత దూరం వెళ్ళిన వారు మళ్లీ తిరిగి అదే ఊరికి ఎందుకు రావాల్సి వచ్చింది?

శతృత్వంతో రగిలిపోయే ఊరిని ఏకం చేసి, తమ పెళ్లిని ఒప్పించడానికి ఆ జంట చేసిన ప్రయత్నాలు ఏంటి? ప్రాణాలకు తెగించి వారు సాగించిన ఈ పోరాటం చివరకు ఎలా ముగిసింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ కథ సాగుతుంది.

విశ్లేషణ :

చంద్రహాస్ 'చందు' పాత్రలో తన వయసుకి తగిన ఎనర్జీతో అద్భుతంగా నటించి మెప్పించారు. డ్యాన్స్, యాక్షన్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో ఈజ్‌తో నటించడం విశేషం. హీరోయిన్‌గా మేఘన తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, అర్జున్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మీసాల లక్ష్మణ్ మరోసారి తన నటనతో అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇలా చిత్రంలోని నటీనటులందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించారు.

దర్శకుడు సంపత్ రుద్ర ఎంచుకున్న పాయింట్ కొత్తది కాకపోయినా, దానిని తెరపై ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. కులమతాలు ప్రేమకు ఎలా అడ్డంకులుగా మారుతున్నాయనే సామాజిక అంశాన్ని, ప్రస్తుత సమాజంలోని పరిస్థితులకు అద్దం పడుతూనే ఎంతో కమర్షియల్‌గా మలిచారు. ఒక సీరియస్ సమస్యను వినోదాత్మకమైన ప్రేమకథకు జోడించి చెప్పే ప్రయత్నం చేయడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం సన్నివేశాలు గతంలో చూసిన సినిమాలను గుర్తుకు తెస్తాయి.

సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఊరి రాజకీయాలు, కులాల మధ్య ఆధిపత్య పోరు, హీరో హీరోయిన్ల స్నేహితుల గ్యాంగ్‌తో వచ్చే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇంటర్వెల్ వద్ద వచ్చే ఒక చిన్న ట్విస్ట్ కథలో ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ విషయానికి వస్తే, దర్శకుడు కథను పూర్తి వినోదాత్మకంగా మార్చేశారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి హీరో హీరోయిన్లు చేసే ప్రయత్నాలు సాఫీగా సాగిపోతుంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే చిన్న మలుపు ఆకట్టుకున్నా, క్లైమాక్స్ మాత్రం అందరూ ఊహించిన విధంగానే సాదాసీదాగా ముగుస్తుంది.

సాంకేతికంగా ఈ సినిమాకు ధృవన్ అందించిన సంగీతం అతిపెద్ద బలం. కెమెరా వర్క్ విజువల్స్ పరంగా సినిమాను రిచ్‌గా చూపించగా, ఎడిటింగ్ ఎక్కడా బోర్ కొట్టించకుండా షార్ప్‌గా సాగుతుంది. మాటలు, పాటలు కూడా అలరించేలా ఉన్నాయి. నిర్మాతలు రాజీ పడకుండా పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక చక్కని యూత్‌ఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఇది తప్పకుండా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

రేటింగ్ : 3.0/5.0

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: