కృష్ణ సింహాసనం @40 ఏళ్లు.. ఎవరికి తెలియని విశేషాలు..!
స్టోరీ విషయానికి వస్తే:
దశార్ణ రాజ్యసైనాధిపతి విక్రమసింహ (కృష్ణ) శక్తిసామర్థ్యాలను గుర్తించి అతడికి భవాని ఖడ్గాన్ని బహుమతిగా ఇస్తారు క్షేయేంద్ర భూపతి. యువరాణి అలకనందా దేవి (జయప్రద) విక్రమ సింహాన్ని ప్రేమిస్తుంది. అయితే రాజ్య మంత్రి భేరుండ(ప్రభాకర్ రెడ్డి) కుట్ర చేసి విక్రమ సింహను రాజ్య బహిష్కరణ అయ్యేలా చేస్తారు. రాజ్య బహిష్కరణ అనంతరం తిరిగి విక్రమసింహ రాజ్యంలోకి ఎలా అడుగు పెడతారు? అవంతి యువరాజు ఆదిత్య వర్ధనుడు విక్రమ సింహ పోలికలు ఉండడానికి కారణం? నృత్యకారుని జస్వంతి (రాధ), యువరాణి (జయప్రద) , విషకన్యచందన (మందాకిని) కథ ఏంటి? మంత్రి భేరుడ కుట్రలను భంగం చేయడానికి ఆదిత్య ఏం చేశారు అనేది ఈ సినిమా కథ.
కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ఈ సినిమా. ఇందులో కృష్ణ సైన్యాధిపతిగా ,యువరాజుగా రెండు పాత్రలు పోషించారు. హిందీలో సింఘాసన్ పేరుతో రెండు భాషలలో విడుదల చేశారు. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు.
ఈ సినిమా విడుదలైన మొదటి వారంలో ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కొన్న బయ్యారులకు మొదటి వారంలోని రూ.1.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. మద్రాసులో శతదినోత్సవం జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే. అంతేకాకుండా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ కి ఏపీ నుంచి 400 బస్సులలో అభిమానులు తరలి వెళ్లారు.
ఈ సినిమాకు కృష్ణ చేసిన సాహసం హైలెట్. ఈ సినిమాతోనే కృష్ణ సంగీత దర్శకుడు బప్పిలహరిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు.
అప్పట్లో ఒక్కో చిత్రానికి 40 నుంచి 50 లక్షలు ఖర్చయ్యేది అయితే ఈ సినిమాకి ఏకంగా కృష్ణ రూ.3.20 కోట్లు ఖర్చు చేశారు. తెలుగు, హిందీ భాషలలో 65 రోజులలోనే పూర్తి చేశారు.
70MM 6 స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తీసిన మొట్టమొదటి తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ సాంకేతిక కూడిన థియేటర్లు కూడా అప్పట్లో అందుబాటులో లేవు. ఈ సినిమా కోసమే అదనంగా ఖర్చు చేసి మరి గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు తో సహా మరికొన్ని ప్రాంతాలలో రిలీజ్ కి ముందు అలాంటి స్క్రీన్ ఏర్పాటు చేశారు.
సింహాసనం విడుదలకు ముందు విజయవాడలో అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగుల కృష్ణ కటౌట్ పెట్టారు. ఈ చిత్రానికి భారీ స్పందన రావడంతో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల విజయవాడలో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. సినిమా టికెట్లు ఉంటేనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదట. అలా మొదటిసారి సినీ చరిత్రలోనే ఒక చిత్రం కోసం 144 సెక్షన్ విధించడం ఇదే మొదటిసారి.