దృశ్యం3 తెలుగు వెర్షన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా.. వెంకీ స్థానంలో ఆయనను చూస్తారా?
భారతీయ చలనచిత్ర రంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లింగ్ ఫ్రాంచైజీ 'దృశ్యం'. మొదటి రెండు భాగాలతో మైండ్ బ్లోయింగ్ సక్సెస్ అందుకున్న ఈ సిరీస్ నుండి ఇప్పుడు మోస్ట్ అవేటెడ్ మూవీ 'దృశ్యం 3' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నేరుగా థియేటర్లలోకి అడుగుపెడుతోంది. అయితే ఈసారి మేకర్స్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఎప్పుడూ మలయాళంలో రిలీజ్ అయ్యాక తెలుగులో రీమేక్ అయ్యే ఈ చిత్రం, ఈసారి మాత్రం ఒరిజినల్ వెర్షన్‌తో పాటే తెలుగు డబ్బింగ్ రూపంలోనూ ఒకే రోజు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ ఇక్కడ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? తెలుగు ప్రేక్షకులు వెంకటేష్ స్థానంలో మోహన్ లాల్‌ను రాంబాబుగా కాకుండా జార్జ్‌కుట్టిగా ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు ప్రేక్షకులకు 'దృశ్యం' అనగానే వెంకటేష్, ఆయన పోషించిన రాంబాబు పాత్రే గుర్తొస్తాయి. ఆ అమాయకత్వం, ఫ్యామిలీ సెంటిమెంట్, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసే పోరాటం ఇక్కడి ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు 'దృశ్యం 3' డైరెక్ట్‌గా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూపంలో వస్తుండటంతో, తెరపై వెంకటేష్ స్థానంలో మోహన్ లాల్‌ను చూడాల్సి ఉంటుంది. అయితే సినిమా లవర్స్‌కు మోహన్ లాల్ సరికొత్తగా ఏమీ అనిపించరు. 'జనతా గ్యారేజ్', 'మన్యం పులి' సినిమాలతో ఆయన ఆల్రెడీ తెలుగు వారికి చాలా దగ్గరయ్యారు. పైగా ఒరిజినల్ 'దృశ్యం' లవర్స్ అందరికీ జార్జ్‌కుట్టి పాత్రపై అపారమైన గౌరవం ఉంది. కాబట్టి వెంకటేష్ స్థానంలో మోహన్ లాల్‌ను అంగీకరించడం తెలుగు ప్రేక్షకులకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అయ్యే అవకాశాల విషయానికి వస్తే, దీనికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 'దృశ్యం' సిరీస్ రన్ అయ్యేది కేవలం హీరో ఇమేజ్ మీద మాత్రమే కాదు, జీతూ జోసెఫ్ రాసే అద్భుతమైన స్క్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్ మీద. గత రెండు భాగాల ముగింపు చూసిన ఎవరికైనా, అసలు మూడో భాగంలో జార్జ్‌కుట్టి పోలీసుల నుంచి ఎలా తప్పించుకుంటాడు? ఈ కథకు ఎలాంటి ముగింపు లభిస్తుంది? అనే క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఈసారి మలయాళ, తెలుగు వెర్షన్లు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో ట్విస్టులు ఎక్కడా లీక్ అవ్వవు. థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుడికి ఫ్రెష్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటేనే ఈ సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అర్థమవుతోంది. కేవలం మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ సస్పెన్స్ డ్రామాను చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కథలో కనుక ఊహించని మలుపులు, మొదటి రెండు భాగాలను మించిన మైండ్ గేమ్‌లు ఉంటే మాత్రం, తెలుగులో ఈ డబ్బింగ్ వెర్షన్ భారీ వసూళ్లను సాధించడం ఖాయం. రాంబాబు స్థానంలో వస్తున్న జార్జ్‌కుట్టి తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.