‘హే చికీతా’ రివ్యూ - రైతుల గొప్పదనం చాటే చిత్రం

Reddy P Rajasekhar

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది అన్నది ఓ సారి చూద్దాం

కథ
నాగనూరు, లచ్చక్క పేట గ్రామాల మధ్య ఈ కథ సాగుతుంది. శివ (అభినవ్ మణికంఠ) అతని ఫ్రెండ్స్ సాయి (అజయ్), సూరి, రాజు, కృష్ణ స్నేహితులు. శివకి ముక్కు మీద కోపం. చదువు అబ్బకపోవడంతో ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. శివకి చిట్టి (దివిజ), పొట్టి (తన్మయ్ ఖుషి) ఇద్దరు మరదళ్లు ఉంటారు. శివ, చిట్టి చిన్నతనం నుంచీ ప్రేమించుకుంటారు. పొట్టి కూడా తన బావని ప్రాణంగా ప్రేమిస్తుంది. చిట్టి తండ్రి మాత్రం ఉద్యోగం చేసే వాడికే తన కూతురిని ఇస్తానంటాడు. శివ ఎంత ప్రయత్నించినా డిగ్రీనే పాస్ కాలేకపోతాడు. మరి శివ తన ప్రేమను గెలిపించుకుంటాడా? వ్యవసాయం చేసే వాడికి పిల్లను ఇవ్వను అని పట్టుబట్టిన తన మామ పంతం వదిలేస్తాడా? వీరిద్దరి ప్రేమ రెండు ఊర్ల పంచాయితీగా ఎలా మారింది? చివరకు ఈ జంట ఒక్కటి అయిందా? లేదా? ఈ కథలో కల్లు మామ, రాజన్న (దేవి ప్రసాద్) పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.

నటీనటులు
శివ అలియా బీపీ పాత్రలో అభినవ్ చక్కగా నటించాడు. అభినవ్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. దివిజ పాత్ర, ఆమె డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. పొట్టి పాత్రలో తన్మయి అందరినీ గుర్తుండిపోతుంది. శివ ఫ్రెండ్స్ పాత్రల్లో సూరి, రాజు, కృష్ణ, సాయి అందరూ మెప్పిస్తారు. రాజన్నగా దేవి ప్రసాద్ మరోసారి ఓ మంచి పాత్రలో కనిపిస్తారు. కల్లు మామ అప్పుడప్పుడు అలా కనిపించి నవ్వించి వెళ్తుంటాడు. చివర్లో ఆయన పాత్రే కీలకంగా మారుతుంది. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు తగ్గట్టుగా మెప్పిస్తారు.

విశ్లేషణ
హే చికీతా ఆరంభం కాస్త స్లోగానే ఉంటుంది. హీరో, హీరో ఫ్రెండ్స్ పాత్రల పరిచయం, ఊర్లో గణేశుని నవరాత్రి ఏర్పాట్లు అంటూ అలా నెమ్మదిగా కథలోకి తీసుకు వెళ్తారు. హీరో అండ్ కో చేసే అల్లరి, కామెడీ కాసేపు రిలీఫ్‌గా ఉంటుంది. బావ, మరదళ్ల సీన్లు కూడా చక్కగా ఉంటాయి. ఎక్కడా అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా తెరకెక్కించడం గొప్ప విషయం. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా సినిమాని రూపొందించారు. రౌడీ గ్యాంగ్‌తో హీరో గ్యాంగ్‌కి పదే పదే గొడవలు జరుగుతుంటాయి. ముక్కు మీద కోపం ఉండే శివ నిమజ్జనం ఊరేగింపులో తమ మీదకు దాడికి వచ్చిన గ్యాంగ్‌లో ఓ వ్యక్తిని కత్తితో పొడిచేస్తాడు.  అలా ఇంటర్వెల్ బ్లాక్‌తో అందరిలోనూ ఓ క్యూరియాసిటీని పెంచేస్తారు.

ఒకరిని పొడిచేసి.. జైలుకి వెళ్లి వస్తే.. ఊర్లో ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. ఇక శివ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరదల్ని పెళ్లి చేసుకోవాలని శివ ప్రయత్నిస్తాడు. కానీ చిట్టి తండ్రి మాత్రం ఉద్యోగం ఉన్న వాడితోనే పెళ్లి చేస్తానని ఎంగేజ్మెంట్ చేసేస్తాడు. నిశ్చితార్థం అయినా కూడా శివ, చిట్టి ఊరి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అలా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సీన్లు మెప్పిస్తాయి. రైతుల గొప్పదనం, వ్యవసాయం గురించి చెప్పే సీన్లు అందరినీ కదిలిస్తాయి. క్లైమాక్స్ సంతృప్తికరంగా అనిపిస్తుంది.

హే చికీతా చిత్రంలో దర్శకుడు ఎన్నో అంశాలు, సందేశాల్ని స్పృశించాడు. రైతుల బాధలు, ఊర్లోని కష్టాలు, వ్యవసాయం, వ్యవసాయదారుడిపై చిన్న చూపు ఇలాంటి అంశాలెన్నో చూపించాడు. వీటన్నంటిలో ఓ చక్కటి బావామరదళ్ల ప్రేమ కథను కూడా చూపించే ప్రయత్నం చేశాడు. యూత్‌ ఫుల్ మూవీలో రైతే రాజు అనే కాన్సెప్ట్‌ను జోడించి అందరినీ ఆకట్టుకునేలా ‘హే చికీతా’ని దర్శకుడు ధన్ రాజ్ మలిచే ప్రయత్నంలో చాలా వరకు సఫలం అయినట్టు చెప్పుకోవచ్చు.

టెక్నికల్ విషయానికి వస్తే అంజి కెమెరా వర్క్ ఎంతో నేచురల్‌గా ఉంటుంది. చరణ్ అర్జున్ పాటల్లో ఫీల్ కనిపిస్తుంది. ప్రేమ పాటైనా, విషాద గీతమైనా సరే ఇందులోని పాటలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. బీజీఎం కూడా చాలా వరకు సీన్లను ఎలివేట్ చేస్తుంది. రైతుల గురించి చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఎడిటింగ్ బాగుంటుంది. కాస్ట్యూమ్స్ సహజంగా ఉంటాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉంటాయి. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. ఓవరాల్‌గా ‘హే చికీతా’ వింటేజ్ విలేజ్ డ్రామాగా అనిపిస్తుంది. ఇందులో యూత్‌కి నచ్చే అంశాలతో పాటుగా సామాజిక సందేశం ఉంటుంది. రైతే రాజు అన్న నినాదాన్ని మరోసారి చాటి చెప్పేలా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: