వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
‘ప్రియురాలు’, ‘సిట్ (ZEE5)’ వంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న యువ నటుడు కౌశిక్ మేకల. ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త తరం నటులు వినూత్నమైన కథలతో, సరికొత్త కంటెంట్‌తో ఆడియెన్స్‌ని అలరిస్తున్న తరుణంలో, కౌశిక్ తనదైన సహజ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ‘పార్ట్ టైమర్స్’ అనే వెబ్ సిరీస్‌లో కథానాయకుడిగా నటించి, తన పర్ఫార్మన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. డిజిటల్ వేదికపై ఈ సిరీస్ ప్రస్తుతం అత్యుత్తమ వీక్షణలతో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది.
కేవలం వెబ్ సిరీస్‌లు, సినిమాలకే పరిమితం కాకుండా ప్రకటనల (Ads) రంగంలోనూ కౌశిక్ తన ప్రతిభను చాటుకున్నారు. స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి పలు ప్రముఖ బ్రాండ్ ప్రకటనల్లో స్క్రీన్ షేర్ చేసుకుని ప్రేక్షకులను మెప్పించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉండే కౌశిక్, ప్రస్తుతం తన కెరీర్‌ను వేగవంతం చేస్తూ వరుసగా ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్నారు.
కౌశిక్ ప్రధాన పాత్రలో నటించిన "వైరల్ వీడియో" అనే చిత్రం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని అతి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు 'సైక్ సిద్ధార్థ్' చిత్ర దర్శకుడు వరుణ్ రెడ్డి దర్శకత్వంలో కౌశిక్ ఓ ఆసక్తికరమైన సినిమా చేయనున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు జీవీ రామరాజు కాంబినేషన్లో హీరోగా చేసిన మరో చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫైన్ ఫ్రేమ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కిన మరొక ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
ఇవి కాకుండా ప్రస్తుతం మరో మూడు చిత్రాలు సెట్స్ మీదుండగా, మరికొన్ని విభిన్నమైన కథలు చర్చల దశల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి. క్రేజీ డైరెక్టర్లతో కలసి డిఫరెంట్ ప్రాజెక్ట్‌లు ప్లాన్ చేస్తున్న కౌశిక్ మేకల, రాబోయే రోజుల్లో ఆడియెన్స్‌ని మరింతగా అలరిస్తూ టాలీవుడ్లో ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.