ఓవరాల్ గా 'సాహో' పరిస్థితి.. ?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'సాహో' నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వసూళ్ల పరంగా సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. కాగా తాజాగా యూఎస్ లో ఇప్పటివరకూ ఈ సినిమా $2,772,700 మిలియన్స్ ను సాధించింది. మొత్తానికి త్వరలోనే 3 మిలియన్ మార్కుకు చేరుకుంటుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఇక అలాగే నెల్లూర్ టౌన్ లో అత్యంత వేగంగా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా కూడా 'సాహో' సరికొత్త ఘనతను దక్కించుకుంది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ 'బాహుబలి 2' పేరు మీద ఉండేది. 'బాహుబలి 2' కోటి గ్రాస్ అందుకోవడానికి దాదాపు 5 రోజులు పట్టగా 'సాహో' కేవలం 3 రోజుల్లోనే ఆ గ్రాస్ ను రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. అయితే నైజాంలో మాత్రం సాహో వసూళ్ల పరంపర కొంచెం నెమ్మదించిందనే చెప్పాలి. అలాగే సీడెడ్ లో కూడా సాహో కొన్ని ఏరియాల్లో పర్వాలేదనిపిస్తున్నాడు. ఇక గుంటూరు, కృష్ణ విషయానికి వస్తే.. అక్కడ చెప్పుకోదగ్గ వసూళ్లే సాధిస్తునప్పటికీ.. అక్కడ సాహో థియరిటికల్ రైట్స్ ను భారీ రేంజ్ లో అమ్మడంతో అక్కడ సాహో సాధించాల్సిన వసూళ్ల లెక్క ఇంకా చాలానే మిగిలివుంది.
అయితే ఈ వారం సాహో చిత్రానికి పోటీ ఇచ్చే పెద్ద సినిమాలు ఏవి విడుదలకు లేకపోవడం.. సాహోకి కలిసొచ్చే అంశం. '2 హవర్స్ లవ్, జోడి, ఉండిపోరాదే, నీకోసం, వీడే సరైనోడు' లాంటి చిన్న సినిమాలే విడుదల అవుతున్నాయి. వీటి వలన 'సాహో' కలెక్షన్లకు ఏమాత్రం డోకా ఉండకపోవచ్చు. పైగా సాహోకి థియేటర్ల సంఖ్య కూడా తగ్గదు. కాబట్టి ఈ వారాంతాన్ని కూడా పూర్తిగా 'సాహో' చిత్రమే ఆక్రమించేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తోడు ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ .350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ రోజు కూడా అన్ని ప్రాంతాలలో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇక ఎలాగూ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాహోకి బాగా కలిసిరానున్నాయి. ఇక టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయింది. భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్, విక్రమ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించి ప్రభాస్ కి మరో భారీ చిత్రాన్ని అందించారు.