బ్యానర్ : ఎస్వీఆర్ మీడియా గ్రూప్
చిత్రం : మిష్టర్ 7
తారాగణం : జూనియర్ ఎస్వీఆర్, నీలమ్ ఉపాధ్యాయ, సత్యదేవ్, శ్రీనివాసరెడ్డి, రచనామౌర్య తదితరులు
సంగీతం : మున్నాకాశీ, ఫోటోగ్రఫీ : ప్రభాకర్ రెడ్డి
స్టోరీ, స్రీన్ ప్లే, డైరెక్షన్ : చరణ్ రెడ్డి, నిర్మాత : ఎస్ వి ఎల్ ఎస్ రంగారావు
రేటింగ్ : 1/5
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వారసుల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఎన్నార్ వారసులతో పాటు రామానాయుడు, చిరంజీవి నట వారసులు ప్రస్తుతం తెలుగు తెర మీద హాల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో నటవారసుడు వస్తున్నాడు అనే సరికి సహాజంగానే ఆసక్తి కలుగుతుంది. అలాంటది మహానటుడు ఎస్వీఆర్ మనవడు పరిచయం అవుతున్నాడు అనే సరికి కొంత మంది ఉత్సాహంగా ఎదురుచూశారు. మరి జూనియర్ ఎస్వీఆర్ ఆ అంచనాలు అందుకున్నాడా..?
కథ: లక్ష్మణ్ (జూనియర్ ఎస్వీఆర్) ఒక అనాధ. దొంగతానాలు చేస్తూ, జాలీగా జీవిస్తుంటాడు. ఒక అమ్మాయి (నీలమ్ ఉపాధ్యాయ)తో ప్రేమలో పడతాడు. అయితే అమ్మాయి తండ్రికి చెప్పిన మాట కోసం రెస్టారెంట్ ప్రారంభించాలనుకుంటాడు. లక్ష్మణ్ రెస్టారెంట్ ప్రారంభించాడా.. దానిని ప్రారంభించడానికి అతను డబ్బు ఎలా సంపాదించాడు.. ఈ క్రమంలో ఎవ్వరితో ఆతను తలపడాల్సి వచ్చింది.. అనేది చిత్ర కథ.
నటీనటుల ప్రతిభ : ఎస్వీఆర్ మనవడు అనే గొప్ప బ్రాండ్ నేమ్ తో పరిచయమైన జూనియర్ ఎస్వీఆర్ నటన సాధారణంగా ఉంది. డాన్సులు, ఫైట్లు అన్నీ సాధారణంగా ఉన్నాయి. ఎస్వీఆర్ మనవడని మనం ఈ స్థాయిలో చూడ లేం. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన ఎస్వీ రంగారావు గారిది నిండైన విగ్రహంతో పాటు గంభీరమైన కంఠ స్వరం. ఆ కంఠం తో ఆయన అన్ని రసాలను అవలీలగా పలికించేవారు. పాత్రలను రక్తి కట్టించేవారు. ఈ కంఠ స్వరం విషయంలో ఆయన జూనియర్ కు పాస్ మార్కులు కాదు కాదా.. కనీసం మార్కులు కూడా వేయాలనిపించదు. నీలమ్ ఉపాధ్యాయ అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఈమెకు మంచి భవిష్యత్ ఉందనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి బాగానే నవ్వించాడు. సత్యదేవ్ విలనీజాన్ని బాగా చూపించాడు. మిగిలినవారు తమ పరిధిలో నటించారు.
సాంకేతిక విలువలు : ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. సంగీతం బాగుంది. మాటలు ఫర్వాలేదు. నిర్మాత బాగానే ఖర్చు పెట్టాడు. కథ, కథనాలను తానే సమకూర్చుకున్న దర్శకుడు సినిమాను రెండు న్నర గంటలపాటు నడపడానికి చాలా శ్రమ పడ్డాడు. అసలు కథకు అవసరమైన సన్నివేశాలతో పాటు, అనవసరమైన సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
చివరిగా : టైమ్ పాస్ సినిమా అని అనడానికి కూడా మాటలు రావడం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: