ఆ గోంతుకు ఇంకా పదహారేళ్ల వయసే
"సిరమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా..
సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే... నాతోడూ ఎవరే ...ఎన్నాళ్ళకొస్తాడే"
ఈ పాట తెలుగు సినీ ప్రపంచంలో ఎవర్ గ్రీన్. ఈ పాట ప్రపంచానికి పరిచయమై దశాబ్దాలు గడుస్తున్నా... ఈ పాటకు, ఈ పాట పాడిన గాయని స్వరానికి మాత్రం ఇంకా 'పదహారేళ్లే వయసే'. పరిచయం అక్కర లేని స్వర మాధుర్యం ఆమెది.
"జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార"
ఈ పాటను గానం చేసిన ఆమెకు నంది అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. అంతే కాదు దాదాపు పదికి పైగా నంది అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. 'నీలి మోఘాలలో గాలి కెరటాలలో' అనే తెలుగు పాట నాటి తరానికి, నేటి తరానికి గుర్తుండే ఉంటుంది. 1961లో వచ్చిన 'బావామరదళ్లు' సినిమాలో ఆ పాట గాయని కూడా జానకినే. ఆ రోజుల్లో ఆబాల గోపాలాన్ని అలరించిన 'పగలే వెన్నెల- జగమే ఊయల' పాట తో జానకి స్థానం సినీ పరిశ్రమలో ఆమె ప్రత్యేకతను చాటింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న సంగీత పరికరాలకు తగ్గట్టుగా తన గాత్రాన్ని అందించడం జానకి ప్రత్యేకత. భారత రత్న బిరుదును అందుకున్న షహనాయ్ విధ్వాంసుడు బిస్మిల్లా ఖాన్. ఆయన షెహనాయ్ కి అనుగుణంగా పాట పాడి పలువురి మన్ననలు అందుకున్న తొలి గాయని జానకి కావడం విశేషం.
ఆమె నేపథ్య గాయని మాత్రమే కాదు. సంగీత దర్శకురాలు కూడా. తెలుగులో సంచలనం సృష్టించిన చిత్రం 'మౌన పోరాటం'. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ నిర్మించగా, ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన వ్యక్తి జానకి. మిమిక్రీ ఆర్టిస్తు కాకున్నా... ఆమె నటీనటులకు అనుగుణంగా తన గొంతుతో మిమిక్రీ చేస్తూ పాటలు పాడారు. అవి సంగీత అభిమానులనను ఎంతో అలరించాయి. "గోవుల్లు తెల్లన... గోపయ్య నల్లన.. గోధూలి ఎర్రన ఎందువలన" అన్న పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ల గొంతును ఆమె ఒక్కరే పలికించారు. అంతే కాదు... కే . విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'స్వాతి ముత్యం' సినిమాలో ఆమె పాడిన ... 'చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా'...పాటలో చిన్న పిల్లాడి గొంతు అందరికీ పరిచయమే. 'వెన్నెల్లో గోదారి అందం'...ఆవిష్కరించిన ఘనత ఆమెదే. 'నరుడా .,.. ఓ నరుడా ..ఏమి నీ కోరిక' అంటూ "భైరవ దీపం"లో అలరించిన పాటలు నంది పురస్కారాన్ని అందుకునేలా చేశాయి. ఉత్తమ గాయనిగా నాలుగు జాతీయ అవార్డులు, పదికి పైగా తెలుగు నందులు.. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో పురస్కారాలు ఆమెకు సొంతమయ్యాయి. నవ రాసాలను తన కంఠంలో పలికిస్తారామే. సందర్భాను సారంగా గాత్ర సహకారం అందిస్తారు. అందరినీ అలరిస్తారు. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన తారలు.. సుహాసిని, రాధిక, ఖుష్బూ లు తెరంగేట్రం చేసినప్పుడు వారికి తొలి పాట పాడిన వ్యక్తి జానకి. ఆమె పాడిన మరో యుగళ గీతం ..'ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే'.. పాటను కొరియో గ్రాఫర్ లేకుండా చిత్రించారు. ఇందుకు కారణం ఆ పాట విన్న నటీనటులు రాధిక , చిరంజీవి లు మైమరచి సినీ సెట్ లో డాన్స్ చేశారు. దానిని చిత్రీకరించి సినిమాలో పెట్టేశారు. రాసుకుంటూ పోతే ఎన్నో విశేషాలు జానకి జీవితంలో మనకు కనపడతాయి. అందుకేనేమో సినీ ప్రపంచం అంతా ఆమెను 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా' గా వ్యవహరిస్తుంది.