సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రివ్యూ

Chakravarthi Kalyan
ఓటీటీలో సేవ్ ది టైగర్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చూసినవారంతా పగలబడి నవ్వేసుకున్నారు. అంతలా ఓటీటీలో బ్లాక్ బస్టర్ అయిన సేవ్ ది టైగర్స్‌కు ఇప్పుడు రెండో సీజన్ వచ్చింది. ఈ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సందడి చేస్తోంది. మహి వీ రాఘవ్ షో రన్నర్‌గా తీసిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతలా నవ్వించిందో ఓ సారి చూద్దాం.
కథ
సేవ్ ది టైగర్స్ కథ ఆగినచోటే  రెండో సీజన్ మొదలవుతుంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) కిడ్నాప్ అంటూ.. విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఇక ఆ ముగ్గుర్నీ పోలీసులు చితక్కొట్టేస్తారు. తీరా చూస్తే హంసలేఖ మత్తులోంచి బయటకు వచ్చి.. ఆ ముగ్గురు అమాయకులు, వాళ్లే తనకు హెల్ప్ చేశారని చెబుతుంది. దీంతో ఆ ముగ్గుర్ని రిలీజ్ చేస్తారు. ఆ తరువాత వారి జీవితాల్లోకి హంసలేఖ వల్ల వచ్చిన మార్పులు ఏంటి? విక్రమ్, రేఖ (దేవియాని శర్మ).. రాహుల్, మాధురి (పావని గంగిరెడ్డి).. గంటా రవి, హైమావతి (జోర్దార్ సుజాత)ల మధ్య ఏర్పడిన పరిస్థితులు ఏంటి? గంటా రవి కార్పోరేటర్ అవుతాడా? హైమావతి తాను కోరుకున్నట్టుగా గేటెడ్ కమ్యూనిటికీ వెళ్తుందా? రాహుల్ సినిమా ప్రయత్నాలు, హంసలేఖ కోసం రాసే కథ వర్కౌట్ అవుతుందా? కొత్త కారెక్టర్‌లు సైక్రియార్టిస్ట్ స్పందన (సత్య కృష్ణ), హారిక (దర్శనా బానిక్)ల పాత్ర ఏంటి?అన్నది కథ.
నటీనటులు
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణల నటన బాగుంది. ఈ ముగ్గురూ ఫస్ట్ సీజన్‌లో ఎలా అయితే ఆకట్టుకుంటారో ఈ రెండో సీజన్‌లో అదే స్థాయిలో ఆకట్టుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రియదర్శి అయితే ఎమోషనల్‌గా కదిలిస్తాడు. కామెడీ పండించడమే కాదు.. ఎమోషనల్‌గానూ టచ్ చేస్తాడు. అభినవ్ గోమఠం ఎప్పటిలానే అదరగొట్టేశాడు. ఇక అభినవ్ రోహిణి కామెడీ ట్రాక్ అదిరిపోయింది. రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించారు. జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి సైతం తమ తమ క్యారెక్టర్లలతో మెప్పిస్తారు. జోర్దార్ సుజాత కామెడీ సైతం ఆకట్టుకుంటుంది. హంసలేఖగా సీరత్ కపూర్ అందంగా కనిపించింది. సత్యకృష్ణ, వేణు ఎల్దండి, గంగవ్వ, ముక్కు అవినాష్ తదితరులు తమ పరిధి మేరకు చేశారు.
విశ్లేషణ
 'సేవ్ ద టైగర్స్ 2'లో ఎంత వినోదం ఉంటుందో.. అంతే సందేశం ఉంటుంది. కానీ ఆ సందేశం మాత్రం అందరికీ నేరుగా అర్థం కాదు.  పైపైన చూస్తే సందేశాలేమీ కనిపించవు. హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేసేలానే ఉంటుంది. సమాజంలోని మనుషుల మనస్తత్వాలు, బంధాలు, మనిషిలో ఉండే లోపాలు అన్నింటినీ చూపించాడు. ఇక మహికి మంచి కామెడీ టేస్ట్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే.
మహి రాసుకున్న ఆ కామెడీ ట్రాక్ కారణంగానే 'సేవ్ ద టైగర్స్'  హిట్టయింది. వెబ్ సిరీస్‌లోని ఆ కారెక్టర్లు చూస్తుంటే మనం చుట్టు పక్కల చూసినట్టుగానే అనిపిస్తుంది. అయితే ఏడు ఎపిసోడ్‌లుగా వచ్చిన ఈ రెండో సీజన్ అందరినీ నవ్విస్తుంది. ప్రదీప్ అద్వైతంతో కలిసి మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన 'సేవ్ ద టైగర్స్ 2'లో దాదాపు అన్ని ఎపిసోడ్‌లు ఆకట్టుకుంటాయి. కాకపోతే నాలుగో ఎపిసోడ్‌ అంతగా నవ్వించకపోవచ్చు. మరీ ముఖ్యంగా పెట్స్ అండ్ ఓనర్స్ అంటూ పెట్టిన ఎపిసోడ్ మాత్రం తెగ నవ్విస్తుంది. ఆ ఎపిసోడ్2కు రోహిణి హైలెట్ అవుతుంది.
 'సేవ్ ద టైగర్స్ 2' చూసి అంతర్లీనంగా ఉండే సందేశాలను గమనిస్తే ఎన్నో మంచి విషయాలు చెప్పినట్టుగా కనిపిస్తుంది. భార్యాభర్తల బంధం, తండ్రీ కూతుళ్ళ అనుబంధం, తండ్రిని చూసి పిల్లలు ఎలా ప్రభావితం చెందుతారు అనేది ఇలా చక్కగా చూరపించారు. కామెడీతో పాటు ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. మహి వి రాఘవ్ క్రియేషన్, అరుణ్ కొత్తపల్లి డైరెక్షన్ జోడెద్దుల్లా బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. అజయ్ అరసాడ సంగీతం, ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా సాగుతుంది. మొత్తం మీద సకుటంబ సపరివారంగా ఎంజాయ్ చేసేలా ఉందీ వెబ్ సిరీస్.
రేటింగ్ - 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: