మదన్ దర్శకత్వంలో మరోసారి

Chowdary Sirisha
కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు...  జగపతిబాబు. ఇద్దరు భామల మధ్య నలిగిపోతూ సెంటిమెంట్ని  పండించడంలో తిరుగులేని నటుడాయన.  శోభన్ బాబు తర్వాత మళ్ళీ అంతటి పేరు సంపాదించిన ఘనత జగపతి బాబుదే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆయన  జోరు కూడా కాస్త తగ్గింది.  ఇమేజ్ కి తగిన కథలు రావడం లేదు.  యస్వీ కృష్ణారెడ్డి లాంటి సీనియర్ దర్శకులు రిలాక్స్ అవ్వడంతో జగపతి లాంటి ఫ్యామిలీ హీరోల జోరుకు కళ్ళెం పడిందని చెప్పొచ్చు. అయితే తన అభిరుచి మేరకు నవతరం దర్శకులతో కూడా కుటుంబ కథలు చేస్తూనే ఉన్నారు జగపతి బాబు. 

మదన్ దర్శకత్వంలో "పెళ్ళైన కొత్తలో" అనే సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత  వీరిద్దరి కలయికలో "ప్రవరాఖ్యుడు" సినిమా తెరకెక్కింది. తొలి సినిమా విజయం సాధించింది కానీ... రెండో సినిమా మాత్రం పరాజయాన్ని చవిచూసింది. అయితే వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కూడా ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. మరో కుటుంబ కథ తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇప్పటికే మదన్ కథ కూడా వినిపించారట. అది జగపతికి చాలా నచ్చిందట. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మదన్ ఇటీవల నిర్మాతగా  మారారు. 

 కొత్తవాళ్ళతో "కాఫీ విత్ మై వైఫ్" అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఆ సినిమా  విడుదలవ్వగానే  జగపతి బాబుతో సినిమా మొదలు పెడతాడని తెలుస్తోంది. ఆ సినిమా ఆడియో వేడుకకు కూడా జగపతి హాజరయ్యాడు. మదన్ లాంటి దర్శకులు విరివిగా సినిమాలు తీయాలని జగపతి బాబు ఆడియో వేడుకలో చెప్పారు.  ఇప్పటిదాకా మదన్ దర్శకత్వం వహించింది రెండు సినిమాలకు మాత్రమే. ఆ రెండిట్లోనూ జగపతిబాబే కథానాయకుడు. ఇప్పుడు మూడో సినిమా కూడా ఆయనతోనే తెరకెక్కిస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: