"ఈనాడు" సినీ బహిష్కరణ - "దాసరి"పై "ఈనాడు" బహిష్కరణ..!?

Chakravarthi Kalyan
సినీపరిశ్రమలోని ఆసక్తికరమైన అంశాల్లో ఇదో కోణం. పత్రికారంగంలో పోటీపడిన రామోజీరావు, దాసరి నారాయణ రావు.. ఆ తర్వాత కూడా ఆ వైరాన్ని కొన్నేళ్లపాటు కొనసాగించారు. అప్పట్లో ప్రకటన రేట్లపై వచ్చిన వివాదం కారణంగా ఈనాడు పత్రికపై సినీపరిశ్రమ బహిష్కరణ వేటు వేసింది. సినిమా వార్తల కవరేజ్ కు ఈనాడును పిలవకూడదన్నది నియమం.



ఈ నిర్ణయం అప్పట్లో దాసరినారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఏ విషయంపైనైనా పట్టుదల వస్తే రామోజీని మించిన మొండివారు మరొకరు ఉండరు అంటారు. ఈ విషయంలోనూ అంతే. ఈనాడును సినీ పరిశ్రమ బహిష్కరించినా ఈనాడు పత్రికలో వచ్చే ఈనాడు సినిమా పేజీని మాత్రం యథావిధిగానే ఇచ్చేవారు. ప్రత్యేక కథనాలు వేయడం, చిన్న సినిమాలవార్తలు ఇవ్వడం వంటి చిట్కాలతో సినిమా పేజీ నడిపారు. 



కొన్నాళ్లకు సినీపరిశ్రమ ఆ బహిష్కరణను ఎత్తేసింది. అదే సమయంలో ఈనాడు పత్రికలో దాసరి నారాయణరావు వార్తలపై అప్రకటిత నిషేధం ఉండేది. దాసరి నారాయణరావుకు సంబంధించి వార్తలేవీ ఆ పత్రికలో వచ్చేవి కావు. అవి సినిమావైనే వేరేవైనా సరే. అలా కొన్నేళ్లపాటు దాసరి-రామోజీ పరోక్షయుద్దం సాగింది.



ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఇద్దరూ రాజీకి వచ్చారు. తర్వాత కాలంలో దాసరి నారాయణరావు ఈటీవీ కోసం సీరియళ్లు కూడా నిర్మించారు. ఇద్దరూ కలసి కొన్ని సినీవేడుకల్లోనూ కనిపించారు. దాసరి వార్తలు ఈనాడులో మామూలుగానే వస్తుండేవి. అవును ఎవరూ ఎప్పటికీ శాశ్వత శత్రువులు, మిత్రులుగా ఉండరు కదా.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: