వామ్మో.. ఊగిపోయిన బిగ్ బాస్ స్టేజ్..! రెచ్చిపోయిన కల్పన..!!

Vasishta

స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకాదరణలో ముందుంటోంది. వారానికొకరి చొప్పున ఎలిమినేట్ అవుతున్న ఈ షోలో.. ఈసారి మాత్రం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. శనివారం కత్తి మహేశ్ ఎలిమినేట్ కాగా.. ఆదివారం సింగర్ కల్పన ఎలిమినేట్ అయ్యారు. వెళ్తూవెళ్తూ కల్పన చేసిన పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ స్టేజ్ ను ఊపేసింది.


          కల్పన సింగర్ గా సుపరిచితులే. బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె ఇంట్లో అందరికీ పెద్దక్కలాగా వ్యవహరించారు. ఫస్ట్ వీక్ లో ఇంటి సభ్యుల మనసు దోచుకున్న కల్పన.. రెండోవారం కెప్టెన్ కాగానే తనలోని నియంతృత్వాన్ని బయటపెట్టారు.  ఇది సహించలేని కుటుంబసభ్యులు కల్పనను నామినేట్ చేశారు. ఇటు ప్రేక్షకులు కూడా కల్పనను బయటకు పంపించాలని కోరడంతో ఆమె ఈవారం బయటికొచ్చేసింది.


          ఇంటి సభ్యుల గురించి పాట రూపంలో చెప్పాలంటూ ఎన్టీఆర్ కోరినప్పుడు కల్పన హల్ చల్ చేశారు. ఒక్కొక్కరి గురించి ఒక్కో పాట రూపంలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ముమైత్ ఖాన్ కి చంద్రముఖి సాంగ్ ను అంకితమిస్తూ కల్పన చేసిన పర్ఫార్మెన్స్ కు ఎన్టీఆర్ తో పాటు ఇంటిసభ్యులు కూడా పగలబడి నవ్వారు. అంతేకాదు.. దీక్ష విషయంలో ప్రిన్స్ వ్యవహరించే శైలి, ఆదర్శ్ బిహేవియర్, హరితేజ ఫీలింగ్స్.. ఇలా అన్నింటినీ కల్పన తనదైన స్టైల్లో ప్రజెంట్ చేశారు.


          కల్పనలోని రెండో కోణాన్ని చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ మాత్రమే కాదు బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా కల్పన పర్ఫార్మెన్స్ చూసి విరగబడి నవ్వారు. మళ్లీ ఇంట్లోకి వచ్చేయాలని కోరారు. అయితే.. అప్పటికే ఆమె ఎలిమినేట్ కావడంతో ఇక వచ్చే ఛాన్స్ లేదని ఎన్టీఆర్ స్పష్టంచేశారు. అలా.. కల్పన బిగ్ బాస్ ఇంటి నుంచి పోతూపోతూ స్టేజ్ పై చేసిన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: