కంగనను హృతిక్ అంత మోసం చేశాడా..?

Vasishta

కంగనా రనౌత్-హృతిక్ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. హృతిక్ తనను మోసం చేశాడంటూ కంగన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సద్దుమణిగిందనుకున్న ఈ వ్యవహారంపై కంగన మరోసారి నోరు విప్పింది. మహిళా కమిషన్ సైతం తనకు న్యాయం చేయలేదని వాపోయింది..


ఓ రచయిత భార్య నన్ను బెదిరించింది. హృతిక్ వ్యవహారం వదిలేయకపోతే చచ్చిపోతావని హెచ్చరించింది. రోషన్ కుటుంబం మహిళా కమిషన్ ను కొనేసింది. సెలబ్రిటీనైన నాకే న్యాయం జరగకపోతే సామాన్య మహిళల సంగతేంటి.? ఇవి హృతిక్ విషయంలో తాజాగా కంగన చేసిన వ్యాఖ్యలు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తనను గాఢంగా ప్రేమించి.. తర్వాత మొహం చాటేశాడని.. గతేడాది కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారాన్ని రేపాయి. కంగన్, హృతిక్ మధ్య అప్పట్లో మాటల యుద్ధమే జరిగింది. ఒకరికొకరు కోర్టు నోటీసులు పంపించుకునేంత తారాస్థాయికి గొడవ చేరింది. తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోవడంతో మ్యాటర్ సద్దుమణిగిపోయిందనుకున్నారు. కానీ తాజాగా మళ్లీ కంగన తన ఆవేదనను వెలిబుచ్చింది. చల్లారిన గొడవను తిరిగి రాజేసింది..


హృతిక్ కు భార్య ఉన్నా తనను ఇష్టపడ్డాడని... తాను కూడా అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పింది. అతను మాత్రం తమ మధ్య ఉన్న బంధాన్ని బయట ప్రపంచానికి తెలపలేనని చెప్పాడని పేర్కొంది. ఆ మాటలు నచ్చక తనని మర్చిపోమన్నా.. హృతిక్ వినిపించుకోకుండా తనపై ఒత్తిడి తెచ్చి.. క్రిష్ 3లో నటించేలా చేశాడంది. భార్యతో హృతిక్ విడాకులు తీసుకోవడంతో.. తనతో ఉన్న బంధాన్ని బహిరంగపరుస్తానని మాటిచ్చాడని తెలిపింది. ఆ తర్వాత ప్రేమికుల రోజు నాడు ఫోను చేయలేదని అడిగితే నన్ను మర్చిపొమ్మని చెప్పేశాడని తన ఆవేదన బయటపెట్టేసింది..


మర్చిపొమ్మన్న హృతిక్ వ్యాఖ్యలతో ఎంతగానో కుంగిపోయానని తెలిపిన కంగన.. క్వీన్  సినిమా ఘనవిజయం సాధించాక హృతిక్ తనను క్షమించమన్నాడని చెప్పింది. తిరిగి తమ బంధాన్ని కొనసాగిద్దామా అని అడిగితే.. క్వీన్ విజయం తలకెక్కిందా అని అవమానపరిచాడని తన బాధను తెలిపింది..


తన ఆవేదనను ఇంటర్వూలో బహిరంగంగా చెప్పినందుకు.. తనను బెదిరించారని వాపోయింది. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయని తెలిపింది. దీనిపై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశానన్న కంగన....కమిషన్ కూడా తనకు న్యాయం చేయలేదని తెలిపింది. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయమంటూ కమిషన్ నుంచి తనకు ఫోన్ వచ్చినట్లు వెల్లడించింది. ఓ బాలీవుడ్ రచయిత భార్య అయిన ఓ నటి కూడా తనను బెదిరించిందని చెప్పింది కంగన. ఆమె తనను ఇంటికి పిలిపించి.. ఈ విషయాన్ని వదిలేయకపోతే అవమానాలు భరించలేక చస్తావని హెచ్చరించిందని తెలిపింది..


మరోసారి మీడియా ముందుకు హృతిక్ వ్యవహారం తీసుకొచ్చిన కంగన మాటలకు హృతిక్ మాజీ బార్య సుసానే సమాధానమిచ్చింది. ‘ఇలాంటి ఆరోపణలు, విషాద గాథలు మంచి మనుషుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవు’ అని ట్వీట్‌ చేసింది. గతేడాది హాట్ టాపిక్ గా మారిన కంగన్- హృతిక్ వ్యహారం ఇప్పుడు మళ్లీ తెరిపైకి వచ్చింది. ఈసారి ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: