లక్ష్మీస్ ఎన్టీఆర్ : వర్మ ఏం తీయబోతున్నాడు..? అసలు తీసేంత దమ్ముందా..?

Vasishta

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ నిర్మించి, నటించే ఎన్టీఆర్ బయోపిక్ కు వర్మే దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపించాయి. అయితే అది ముందుకు కదలకపోవడంతో లక్ష్మిపార్వతి కోణంలో సినిమా తెరకెక్కించనున్నట్టు వర్మ ప్రకటించారు. దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు కూడా పెట్టేశారు వివాదాల వర్మ.


          రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరదీశారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు వర్మ. అయితే ఇది లక్ష్మీపార్వతి కోణంలో ఉంటుందని చెప్పడమే పెద్ద సంచలనం. వాస్తవానిరి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాతే చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు వరకూ ఆయన జీవితం తెరిచిన పుస్తకమే.


          లక్ష్మిపార్వతి ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు ఆయన జీవితంలోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు దగ్గరైంది. అప్పటికే కుటుంబంలో అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ ఎన్టీఆర్ లో ఉంది. అనారోగ్యంపాలైనా లక్ష్మీపార్వతే చూసుకునేది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బహిరంగంగా చెప్పి .. ఆమెను పెళ్లి చేసుకున్నారు.


          ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రాకతో అటు కుటుంబంలో, ఇటు తెలుగుదేశం పార్టీలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ రెండో పెళ్లిని సహించలేని కుటుంబం ఆయన్ను పక్కన పెట్టేసింది. కుటుంబసభ్యులందరూ దూరమయ్యారు. అదే సమయంలో పార్టీలో లక్ష్మిపార్వతి జోక్యాన్ని సహించలేని పలువురు నేతలు ఎన్టీఆర్ పై తిరుగుబావుటా ఎగురవేశారు. అటు కుటుంబంలో, ఇటు పార్టీలో తిరుగుబాటు నేతగా చంద్రబాబు ముందున్నారు. కుటుంబసభ్యులు కూడా చంద్రబాబుతో కలసి రావడం, పార్టీలో నేతలు ఆయన వెంటే నడవడంతో పార్టీ నుంచి ఎన్టీఆర్ ను తప్పించి చంద్రబాబు చేజిక్కించుకున్నారు.


          ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నరంటూ పలువురు ఎన్టీఆర్ అభిమానులు విమర్శలు కురిపించారు. అయినా వాటిని పట్టించుకోని నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబుతోనే నడిచారు. అధికారం కోల్పోవడం, పార్టీ చేజారిపోవడం, కుటుంబం దూరం కావడం.. లాంటి కారణాలతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు లోనయ్యారు. అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యంతోనే కన్నుమూశారు. లక్ష్మిపార్వతి రాకవల్లే ఎన్టీఆర్ కు ఇలాంటి పరిస్థితి తలెత్తిందనేది అటు కుటుంబం, ఇటు ఎన్టీఆర్ అభిమానలు చెప్పేమాట. మరి వర్మ తీసే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇటీవలకాలంలో వర్మ చాలా సినిమాలు ప్రకటించారు.. కానీ అవేవీ పట్టాలెక్కలేదు. మరి ఇదైనా క్లాప్ కొట్టుకుంటుందో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: