ప్రభాస్ ను కరణ్ జోహార్ తక్కువ అంచనా వేశాడు!

బాలీవుడ్ ప్రఖ్యాత దర్శక నిర్మాత కరణ్ జోహార్, ఇప్పటి  వరకు సమర్ధులైన ప్రభాస్ లాంటి హీరోలను ఎదుర్కొని ఉండరు. దక్షిణ భారత కథానాయకులను ఆయన దర్శకత్వం చేసి ఉండకపోవచ్చు, అదీ డైరెక్టుగా. 1800 కోట్లు, అదీ అతి తేలికగా వసూళ్ళు సాధించిన బాహుబలి హీరోని తక్కువగా  అంచనావేయటం అతని అపరిపక్వతను లేదా అహంబావంతో దక్షిణాది హీరోల ను చిన్న చూపు చూసే మెంటాలిటిని తెలియజేస్తుంది. 


బాహుబలి తో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించుకున్న ధీరోదాత్త కథానాయకుడు ప్రభాస్, దర్శకుని విశ్వసించి పట్టుసడలని నమ్మకంతో ఐదేళ్లపాటు నిర్విరామంగా కష్టపడి మరీ ప్రభాస్ 'బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కంక్లూజన్'  కోసం పనిచేశాడు. అంతటి అంకితభావం తో పనిచేశాడు కాబట్టే బాహుబలికి అద్వితీయ విజయాన్ని, అంతే స్థాయిలో ఎదురులేని వసూళ్ళు సాధించి పెట్టాడు. 


అలాంటి హీరో ప్రభాస్ ను బాలీవుడ్ కు పరిచయం చేసే అవకాశంవస్తే, ఎవరైనా తక్షణమే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటారు. భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఒక్క భారత్ లోనే 30 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా దేశంలోనే ఏ బాషా సినిమా చేయనంత వసూళ్ళు చేసింది. ఖాన్ త్రయానికి కూడా సాధ్యంకాని ఫీట్ ఇది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ సినిమాలో నటించిన హీరోకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడానికి ఎవరూ వెనుకాడరు. కానీ బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించాడట.


గతంలో "బాహుబలి - ది కంక్లూజన్" బాలీవుడ్ మార్కెట్ పంపిణీ హక్కుల్ని 'ధర్మా ప్రొడక్షన్స్' ద్వారా కరణ్ జోహర్ సొంతం చేసుకున్నాడు. పర్సటేంజ్ రూపంలో నైనా బాగానే లాభాలు దండు కున్నాడు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో ప్రభాస్‌ను తానే బాలీవుడ్‌కి పరిచయం చేస్తానని చెప్పాడు. అయితే తను అన్నట్టుగానే డార్లింగ్‌ని కదిపాడట. కానీ బాలీవుడ్ లో  సినిమా చేసేందుకు ప్రభాస్ రూ. 20 కోట్లు అడిగాడట. ప్రభాస్ అడిగిన రెమ్యూనరేషన్‌తో కళ్లుబైర్లు కమ్మిన కరణ్‌ జోహార్ ఆయన పట్ల చాలా ఆగ్రహం గా ఉన్నాడని బాలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో కరణ్‌ జోహార్ పెట్టిన ట్వీట్‌లోనూ ప్రభాస్‌ తీరుపై పరోక్షంగా విమర్శలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ కరణ్‌ ట్వీట్‌ చేయకపోవడమూ దీనికి నిదర్శనమని అంటున్నారు.


బాహుబలి' సినిమాల కోసం రూ. 25 కోట్లు పారితోషికం తీసుకున్న ప్రభాస్‌, తన కొత్త సినిమా  'సాహో'  కోసం రూ. 30 కోట్లు తీసు కున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్‌కు తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీ లోనూ మార్కెట్‌ ఉంది. కాబట్టి ఆయన సినిమాకు ఎంత ఖర్చుపెట్టినా, తిరిగి వసూళ్ళ రూపంలో రాబట్టుకొనే సత్తా ఉంది కాబట్టి ఈమాత్రం డిమాండ్  చేయడంలో తప్పేమీ లేదని ట్రేడ్‌ పండితులు చెప్తున్నారు.


'వరుణ్‌ ధావన్‌'  తాజా సినిమా 'జుడ్వా-2' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని 200 కోట్లకుపైగా వసూలు చేయడంతో, యువహీరో వరుణ్ ధావన్‌ తన రెమ్యూనరేషన్‌ను ఏకంగా రూ. 25 కోట్లకు పెంచేశాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్‌ సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ. 60 కోట్ల వరకు వసూలు చేస్తుండగా, అమీర్ ఖాన్ రూ. 50 కోట్లు, షారుక్ రూ. 45 కోట్ల వరకు అందుకుంటున్నారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌కు రూ. 40 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుతోంది. ఈ క్రమంలో ప్రభాస్‌ రూ. 20 కోట్లు కోరడం అసాధారణ మేమీ కాదని, అతి  తక్కువేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.


రజనీకాంత్ లాంటి దక్షిణాది సూపర్ స్టార్లే బాలీవుడ్ లో నటించడానికి ఇంత రేంజ్‌లో డిమాండ్ చేయలేదు. ప్రభాస్ కు ఇంత ఇవ్వాలా? అనుకున్నాడేమో! ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయంచేసే ఆలోచనల్ని కరణ్ జోహార్ విరమించుకున్నాడట. అంతే కాకుండా కరణ్ ఒకట్వీట్ చేశాడు. అది ప్రభాస్‌ను విమర్శిస్తూ చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


వందల కోట్లతో నిర్మించే సినిమాకు అతి స్వల్ప రెమ్యూనరేషన్ తేడాకే,  మీన మీషాలు లెక్క పెట్టే సినిమా  లో నటించకుండా ఉంటేనే మంచిది. అయినా ప్రభాస్ రెమ్యూనరెషన్ డిమాండ్ చేశాడన్నది పచ్చి అబద్ధమే అయి ఉంటుందన టాలీవుడ్ కోడై కూస్తుంది.  బాహుబలి నిర్మాతలే ఆఫర్ చేసిన అదనపు రెమ్యూనరేషన్ నే అంగీకరించాలా? వద్దా? అని ఆ సినిమా దిగ్దర్శకుడు రాజమౌళి సలహా అడిగిన వ్యక్తి రెమ్యూనరేషన్ విషయం లో పట్టుపట్టడనటం నమ్మతగినదిగా లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: