‘బిగ్ బాస్’ సీజన్ 1 విన్నర్ గా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన శివాబాలాజీ నిర్మాతగా మారి వెండితెర ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఈవారం తనప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నాడు. ‘కాటమరాయుడు’ లో పవన్ కల్యాణ్ సోదరుడిగా నటించి పవన్ అభిమానుల మెప్పును పొందిన శివబాలాజీ ఈవారం ఒకచిన్న మల్టీస్టారర్ మూవీతో తన అదృష్టానికి పరీక్ష పెట్టుకుంటున్నాడు. తను నిర్మాతగా మారి ‘స్నేహమేరా జీవితం’ అనే సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా కొన్ని నెలల కిందటే పూర్తయింది.
అయితే ఇతడు బిగ్ బాస్ హడావిడిలో పడిపోవడంతో ఈసినిమా విడుదల ఆలస్యం అయింది. 1980 బ్యాక్ డ్రాప్లో ఒక యధార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఇద్దరుస్నేహితుల మధ్య జరిగే కధను ఆధారంగా తీసుకుని ఈసినిమా నిర్మించారు. శివబాలాజీతో పాటు రాజీవ్ కనకాల కూడ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. శివబాలాజీ సరసన యు.ఎస్. కు చెందిన తెలుగు అమ్మాయి క్లాసికల్ డ్యాన్సర్ సుష్మ యార్లగడ్డ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ‘బిగ్ బాస్’ విజేత అయిన తరువాత శివ బాలాజీకి ఫాలోయింగ్ పెరిగిన నేపధ్యంలో ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని శివబాలాజీ చాలా ఆశలు పెట్టుకున్నడు.
ఇప్పుడు సరైన టైమింగ్ చూసి ‘స్నేహమేరా జీవితం’ ట్రైలర్ లాంచ్ చేశాడు శివబాలాజీ. ఈమధ్య రిలీజైన ఈమూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో చాలామందికి నచ్చిన నేపధ్యంలో ఈసినిమా సక్సస్స్ అయ్యే ఆస్కారంఉంది అనేఅంచనాలు పెరుగుతున్నాయి. ఇది ఇలాఉండగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈసినిమా విజయవంతం కావాలని కోరుతూ సినిమా పోస్టర్ కి హారతులిచ్చారు. ఈవిషయాన్ని తెలుసుకున్న శివబాలాజీ ఆనందంతో పొంగిపోవడమే కాకుండా ఈవీడియోను జత చేస్తూ తన కామెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు .
‘ఇంత ప్రేమకు నేను అర్హుడినా అని కళ్లు చెమర్చాయి, మనసు కలవరంగా ఉంది. నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం మీ ఈ ప్రేమ. ఏం చేసి, ఏం ఇచ్చి ఇంత ప్రేమను తిరిగివ్వగలనో అర్థం కావట్లేదు. మీకు సదా రుణపడి ఉంటాను. ఇంతగా అభిమానిస్తున్న మీలో ప్రతి ఒక్కరికీ వేల కోట్ల వందనాలు కృతజ్ఞతలు’ అంటూ శివబాలాజీ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు బాగా కనెక్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి..