శ్రీదేవిపై నిందలు వేసి మానసిక అశాంతికి గురిచేసిన రాజమౌళి


సందర్భమో అసందర్భమో రాజమౌళి మాత్రం శ్రీదేవిపట్ల అభ్యంతరకరంగా బాహుబలి ప్రచారకార్యక్రమాల సందర్భంగా మాట్లాడారు. ఇది ఆయన లాంటి విఖ్యాత దర్శకుడు ప్రజావేదికపై మాట్లాడి తన పరువు ప్రతిష్ఠ పై మాయని మరక వేసుకున్నారు. 250కి పైగా సినిమాలు. 50 ఏళ్ల కేరీర్‌. బహుబాషలు. బహు ప్రాంతాలు. విభిన్న సంస్కృతుల మద్య పెరిగిన అనుభవం. భిన్న వయసులో బహుముఖ పాత్రలు. చిన్నపాప నుంచి సూపర్ స్టార్‌ హీరోయిన్‌ వరకు 250 చిత్రాలు. అర్థశతాబ్ధం పాటు  సుధీర్ఘ ప్రస్థానం.   


ఎవరూ ఆమెపై చెడుగా మాట్లాడింది లేదు. ఆమె మరొకరికి గుఱించి చెడుగా చెప్పింది లేదు. ఒకరికి హాని చేసిందన్న నిందలేదు. కానీ  50 ఏళ్ల కేరీర్‌ లో ఆమెను ఇబ్బంది పెట్టింది మాత్రం దిగ్ధర్శకుడు రాజమౌళి వ్యవహారం మాత్రమే. అదీ బృహత్తర బాహుబలి విజయోత్సవం సంధర్భంగా ఆయన చెప్పిన సందర్భమే. 

రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో శ్రీదేవిని నటింప చేయాలని రాజమౌళి భావించారట. కానీ అది వీలు కాలేదు. ఇలా ఎందుకు జరిగిందన్న దానిపైనే రాజమౌళి శ్రీదేవిని ఒక దురాశాపరురాలి గా అమానవీయంగా ప్రవర్తించినట్లు  ప్రచారం చేశారు.  ఆమె 10 కోట్లు డిమాండ్ చేశారని, తన కోసం తన పరివారం కోసం ఒక హోటల్ మొత్తం ప్రత్యేకించాలని అన్నారని, తమ కోసం 10 విమాన టికెట్లు ఏర్పాటు చేయమన్నట్లు ఆమెపై తీవ్రస్థాయిలో ఆరోపణలు  చేశారు. రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూ లో బహిరంగంగా శ్రీదేవిపై నిందలేయడం ఆమెను కలవరపాటుకు గురిచేసింది.

ఇటీవల ఒక తెలుగు వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఖరికి ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే ఆమె మాటల్లోనే!

ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్ ఎక్కడికి వెళ్లినా దీని గురించే అడుగుతున్నారు. కొన్ని కారణాల వల్ల నా కేరీర్‌లో చాలా చిత్రాలు చేయలేకపోయా. అవి పెద్ద హిట్‌ కూడా అయ్యాయి. కానీ ఏనాడు ఆ సినిమాలు ఎందుకు చేయలేదు అని ఎవరూ అడగలేదు. వాటి వల్ల నేను బాధపడింది లేదు. కానీ బహుబలి విషయంలో మాత్రం పదేపదే నా గురించి మాట్లాడుతున్నారు. దీనిపై మాట్లాడకూడదనుకున్నా. ఏవో ప్రచారం చేసుకుంటుంటారులే అనుకున్నా. కానీ పదేపదే అడుగుతున్నారు కాబట్టి వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను మరీ అంత అన్యాయంగా డిమాండ్ చేసేదాన్నే అయితే 300 సినిమాలు, 50 ఏళ్ల కేరీర్ ఉండేదా! ఎప్పుడో ప్యాక్‌ చేసి పంపించేవారు. నేను ఎనిమిది కోట్లు, పది కోట్లు డిమాండ్ చేశానంటున్నారు. ఒక హోటల్ మొత్తం బుక్‌ చేయమన్నానట. పది విమాన టికెట్లు అడిగానట. అలా డిమాండ్ చేసే దాన్నే అయితే ఇక్కడి వరకు వచ్చే దాన్నా! రాఘవేంద్రరావు దగ్గరే 24 సినిమాలు చేశా. నా గురించి ఇక్కడి వారికి కూడా తెలుసు. కానీ బహుబలి విషయంలో మాత్రం నా గురించి పదేపదే మాట్లాడుతున్నారు. చివరకు రాజమౌళి కూడా పబ్లిక్‌గా వచ్చి నా గురించి చెప్పడం చూసి బాధపడ్డా. హిందీ వర్షన్‌ హక్కులు కూడా అడిగానని మొదట్లో వార్తలొచ్చాయి  రాజమౌళి ఇంటర్వ్యూ చూసి షాక్ అయ్యా. చాలా బాధపడ్డా. రాజమౌళి కామ్‌ గా ఉండే వ్యక్తి, హుందాగా ఉండే వ్యక్తి అని విన్నా. ఆయన కూడా ఇలా ప్రజా వేదికలపైకి వచ్చి నా గురించి ఇలా చెప్పడం చాలా చాలా బాధకలిగించింది. నా భర్త బోనికపూర్‌ కూడా ఒక నిర్మాతే.  ఒక నిర్మాత కష్టాలేంటో మాకు తెలుసు. కాబట్టి అంత అన్యాయంగా డిమాండ్ చేసే మనస్థత్వం మాత్రం మాది కాదు. అయినా సరే బాహుబలి లాంటి చిత్రాలను రాజమౌళి మరిన్ని నిర్మించి ఉన్నతస్థాయికి ఎదగాలని కోరు కుంటున్నా” అని శ్రీదేవి వ్యాఖ్యానించారు.

శ్రీదేవి సుధీర్ఘ సినీజీవితంలో ఎప్పుడూ పడని నీలాపనిందలను బాహుబలి సమయంలో ఎదుర్కొన్నారు. చిత్రపరిశ్రమలో ఇలా చాలా కారణాల వల్ల చాలా మంది నటులు కొన్ని చిత్రాల్లో నటించకుండా ఉండడం సహజమే  కానీ బాహుబలి ప్రచారానికి ఒక ఊపు, ఒక హైప్‌, ఒక రూపు తీసుకురావటం కోసం శ్రీదేవి పై ప్రతికూలంగా తనను ఒక విలన్ గా చిత్రీకరించే విధంగా ప్రచారం చేశారన్న విమర్శ కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: