ప్రముఖ గాయకుడు మృతి..!

Edari Rama Krishna
ప్రముఖ తెలుగు సినీ నేపథ్య గాయకుడు కొండబాబు కృష్ణ మోహనరాజు (84) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1934లో విజయవాడలో జన్మించిన మోహనరాజుకు నలుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, జానకి వంటి దిగ్గజ సింగర్ల వద్ద నేపథ్య గానంలో పాలు పంచుకున్న మోహన్ రాజు... పలు టీవీ, రేడియో షోలకు ప్లే బాక్ సింగర్‌గా కూడా పని చేశారు.   1960-70 దశకంలో తెలుగుసినిమాల్లో ఆయన పాటలు పాడారు.
1968లో వచ్చిన పూలరంగడు సినిమాలోని చిగురులు వేసిన కలలన్నీ పాట నేపథ్య గాయకుడిగా ఆయనకు గుర్తింపును తెచ్చింది. తన సినీ ప్రయాణంలో ముసురేసిందంటే మామ (విధివిలాసం), అన్నావదినా (పెద్దన్నయ్య), ఎవరికి వారే ఈ లోకం (సాక్షి), మరుమల్లెలు (పెళ్లి కాని పెళ్లి), ప్రేమించే మనసొకటుంటే (మహాత్ముడు), పొడలా పొడలా గట్ల నడుమా (మా భూమి), రాధను నేనైతే (ఇన్‌స్పెక్టర్ భార్య), కనబడని చెయ్యేదో (తాసిల్దారుగారి అమ్మాయి)తో పాటు వందకుపైగా సినీగీతాలను ఆలపించారు.

సంగీత దర్శకులు కేవీ మహదేవన్, ఎస్.రాజేశ్వర రావు, సత్యం, మాస్టర్ వేణులతో కలిసి ఈయన పనిచేశారు. ఈయన పాడిన ‘ఎవరికి వారే ఈ లోకం’, ‘మరు మల్లెలు ఘుమ ఘుమ లాడే’ వంటి పాటలు మంచి ప్రజాధారణ పొందాయి.ఆయన మృతి పట్ల చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కూతురు వీణ కూడా గాయనిగా పేరు తెచ్చుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: