తెలుగు నిర్మాత కన్నుమూత..!

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత, పంపిణీదారు, దర్శకుడు సింగిశెట్టి దశరథ్ ఈరోజు సికింద్రాబాద్ లో మృతి చెందారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డయాలసిస్‌ కూడా చేయించుకుంటున్నారు. దాదాపు ముఫై ఏళ్లకు పైగా ఆయన తెలుగు సినీరంగంలో ఉంటూ పలు సినిమాలను స్నేహితులతో కలిసి నిర్మించారు.  ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

చికిత్స తీసుకుంటూనే ఆయన ఈరోజు ఉదయం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  శివాజీ గణేశన్, రాధా నటించిన “ఆత్మబంధువు” అనే సినిమాతో దశరథ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ తరువాత అనేక తమిళ, ఇంగ్లీష్ చిత్రాలను తెలుగులోకి అనువదించారు. ఖైదీ వేట అనే చిత్రంతో నైజం ప్రాంతంలో పంపిణీ సంస్థను ప్రారంభించి అనేక చిన్న చిత్రాలను విడుదల చేశారు.

ఇంద్రధనుస్సు, పిల్లలు దిద్దిన కాపురం, టార్గెట్ అనే చిత్రాలను దశరథ్ భాగస్వాములతో నిర్మించారు. “టైంపాస్” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.చిన్న చిత్రాల నిర్మాతలకు ఎదరవుతున్న కష్టనష్టాలపై ఆయన ఎన్నోసార్లు స్పందించారు. సినీరంగంలోని అనేక సమస్యలపై జరిగిన పోరాటాల్లో కూడా ఆయన పాల్గొన్నారు.

చిన్న సినిమాల విడుదలలో నెలకొన్న థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి తరపున జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. దశరథ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తంచేస్తూ, వారి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.దశరథ్ మరణం ఊహించలేదని దర్శకుల సంఘం కార్యదర్శి జి. రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శి కట్టా రంగారావు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: