తమాషాగా ఉందా.. తాట తీస్తా..! శ్రీరెడ్డి, సంధ్యలను దులిపేసిన జీవితా రాజశేఖర్

Vasishta

శ్రీరెడ్డి వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలివ్వాలంటూ మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కు వెళ్లింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని పలువురు పెద్దలను శ్రీరెడ్డి రోడ్డుపైకి లాగుతోంది. తాజాగా జీవితా రాజశేఖర్ పైన శ్రీరెడ్డితో కలిసి మహిళా సంఘాల నేతలు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి..


తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో జీవితా రాజశేఖర్ మీడియా ముందుకొచ్చారు. తనపై ప్రగతిశీల మహిళా సంఘం నేత సంధ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హాస్టల్ అమ్మాయిలను రాజశేఖర్ దగ్గరకు పంపిస్తానంటూ ఆధారాల్లేకుండా ఆమె ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. అమ్మాయిలు కలిగిన కుటుంబం అని కూడా చూడకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంధ్యగారికి భర్త ఉన్నాడో లేదో తనకు తెలీదన్న జీవిత.. డైవోర్స్ అనుకుంటానన్నారు. అత్తమామలు ఉన్నారో లేదో తెలీదన్నారు.


సినిమా వాళ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడినా ఎవరూ పట్టించుకోరులే అని అనుకోవద్దన్నారు జీవిత. పవన్ ను తిడితే ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారని.. అలాగే జీవిత వెనక ఎవరూ లేరనుకున్నారేమో జాగ్రత్త అని హెచ్చరించారు. నన్ను అభిమానించే వాళ్లందరికీ తెలియాలనే మీడియా ముందుకొచ్చానన్న జీవిత.. సెలబ్రిటీల కుటుంబాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని హెచ్చరించింది. సినిమా వాళ్లంటా అంత చులకనా.. అని ప్రశ్నించారు. సంధ్యపై పరువు నష్టం కేసు పెడ్తున్నానన్న జీవిత.. తనపై చేసిన ఆరోపణలకు సమాధానమిచ్చే వరకూ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.


శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగిందో తనకు అర్థం కాలేదన్నారు జీవిత. సినిమా రంగంలో తప్పులే జరగడం లేదని తాను చెప్పనన్నారు. అన్ని రంగాల్లో మహిళల వివక్ష జరుగుతూనే ఉందన్నారు. అలాగనే పరిశ్రమలోకి వచ్చే వాళ్లంతా ఇలాగే ఉంటారనడం తప్పన్నారు. ఒకసారి మోసపోవచ్చేమో కానీ.. ఏళ్ల తరబడి మోసపోతుంటే ఏం చేస్తున్నారని జీవిత ప్రశ్నించారు. శ్రీరెడ్డి ఫేస్ బుక్ చూసిన వాళ్లెవరైనా.. ఆమెను ఎవరైనా మోసం చేశారంటా నమ్ముతారా.. అని జీవిత నిలదీశారు. అభిరామ్ తో శ్రీరెడ్డి కలిసున్న ఫోటోలు బలవంతం చేసినట్లున్నాయా.. అని ప్రశ్నించారు. అభిరామ్ శ్రీరెడ్డిని వాడుకున్నాడని నిరూపిస్తే తానే చెప్పుతీసుకుని కొడతానన్నారు.


          సినిమా పరిశ్రమపై ఇంత బురద జల్లుతున్నా పెద్దలెవరూ ముందుకు రాకపోవడాన్ని జీవిత తప్పుబట్టారు. వేషాలు ఇస్తామని మోసం చేస్తుంటే ఎందుకు స్పందించట్లేదన్నారు. ఈ అంశంపై ఇండస్ట్రీలోని మహిళలందరూ ముందుకొచ్చి మాట్లాడాలని జీవిత కోరారు. సినిమా ఇండస్ట్రీలోని మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతుంటే సిగ్గుపడ్తున్నట్టు  చెప్పారు. ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగితే తన దృష్టికి తీసుకురావాలని జీవిత సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: