వాజ్‌పేయి మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు హీరోలు!

Edari Rama Krishna
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బీహారీ వాజ్ పేయి(93) ఇకలేరు. సాయంత్రం 05.05 గంటలకు కన్నుమూసినట్లు ఎయిమ్స్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మూత్రపిండాల వ్యాధి, శ్వాసకోస ఇబ్బందులు, ఛాతీ సమస్యలతో జూన్ 11 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. వాజ్ పాయి మరణ  వార్తను తెలుసుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎయిమ్స్‌కు భారీగా తరలివస్తున్నారు.  నిన్నటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి భారత ప్రధాని మోడీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  ఇప్పటికే పలువురు నేతలు ఎయిమ్స్ కి చేరుకున్నారు.  మాజీ ప్రధాని మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ఆయన ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థించారు.


ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు : డా.మోహన్ బాబు
భారత దేశంలో గొప్ప రాజకీయ నేతను కోల్పోయింది..ఆయన భారత దేశ ముద్దు బిడ్డ...మహాయోగి..ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ దేశ సేవచేశారు.  వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. ఆయన నా మాటలను ఎంతగానో మెచ్చుకునేవారు.   వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో నేనూ..విద్యాసాగర్ రావు కలిసి పనిచేశాము.  వాజ్ పేయి న ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషులు చాలా అరుదు. ఆయన నిస్వార్ధపరుడైన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకొంటున్నాను.


వాజ్ పేయీ మహోన్నతమైన వ్యక్తి : నందమూరి బాలకృష్ణ
మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన  'బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్'ను జూన్ 22, 2000 సంవత్సరంలో ఆయనే ప్రారంభోత్సవం చేశారు. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేశారు.  ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన.  ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు గొప్ప కవి అన్నారు. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు.


అటల్ జీ మరణం భారత దేశానికి తీరని లోటు : పవన్ కళ్యాన్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంపై సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.  ఆయన ఇక మన మధ్య లేరు అనే విషయం జీర్ణించుకోవడం సాధ్యం కాని విషయం అన్నారు. ఆయన మరణం భారత దేశానికి తీరని లోటు అన్నారు.  నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన.  బహు భాషా కోవిదుడైన ఆయన ప్రసంగాలు రాజనీతి మేళవింపుగా, ఎంత సేపు విన్నా వినాలనిపించేవిగా ఉంటాయన్నారు. భారత దేశాన్ని అణుశక్తిగా ఆవిష్కరించడానికి ఆయన చూపిన వజ్ర సంకల్పం, దేశ రక్షణకు కవచంగా మారింది. శత్రువులు మనవైపు కన్నెత్తి చూడటానికి భయపడేలా చేసింది.  ఈ పుణ్యభూమికి ప్రధాన మంత్రిగా సేవలు అందించడం మన భాగ్యం. ఆయనకు భారత జాతి ఎంతో రుణపడి ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి ఘటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: