శ్రావణ శ్రీమహాలక్ష్మి కి స్వాగతం !

Seetha Sailaja
మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. మహిళలు సంతానం అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఈవ్రతాన్ని చేస్తారు. కైలాసంలో శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతి దేవి వచ్చి శివుణ్ణి దేవా లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని అడిగినప్పుడు మహాశివుడు స్త్రీలకు సకల ఐశ్వర్యాలనూ పుత్రపౌత్రాదులనూ ఇచ్చే వ్రతంగా ‘వరలక్ష్మి’ వ్రతంను ఉపదేశించినట్లు ఉపనిషత్తులు చెపుతున్నాయి.   

భూలోకంలో చారుమతి పై లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకరోజు చారుమతి కలలో వరలక్ష్మీదేవి వచ్చి శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే కోరిన వరాలను ఇస్తానని చెప్పడంతో ఈవ్రతం మన భూలోకంలోకి వచ్చిందని పెద్దలు చెపుతారు. చారుమతి ఆకలను తన భర్త అత్తమామలకు ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలు అందరూ కలసి ఇలా వరలక్ష్మి వ్రతం చేసి మూడు ప్రదక్షిణాలు చేసిన వెంటనే వారి ఇల్లు స్వర్ణమయం అయింది అన్న కధలు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాయి. 

కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుంటే శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలు విశిష్టతను సంత రించుకున్నాయి. కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీపార్వతులకు అంత ప్రీతి కరమైనది అని మన ఋషుల అభిప్రాయం. ఈమాసంలో మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తుంటారు. మంగళగౌరి ఆరాధనలో భాగంగా నోములు, వ్రతాలు చేస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ఇచ్చి ఆతల్లి రక్షిస్తూ ఉంటుందని మహిళల విశ్వాసం.   శ్రావణ మాసం అంటే శుభ మాసం శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈనెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈనెలలోనే  జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా అనేక పర్వ దినాలు వస్తాయి. 

శ్రావణ మాసంను  చంద్రుడి మాసం కూడాపరిగ నిస్తారు. ఈమాసంలో నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర వేత్తల నమ్మకం. మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అనారోగ్యముల నుండి తప్పించుకుని మంచి  ఆరోగ్యం పొందడం కోసం  ఈశ్రావణ మాస నియమాలు మన పెద్దలు ఏర్పాటు చేసారు  అనే సిద్ధాంతం కూడ ఉంది. ఈరోజు మన ఇరు రాష్ట్రాలలోని ప్రతి గృహం పండుగ శోభను సంతరించుకుంటూ ‘వరలక్ష్మీ దేవి’ కి స్వాగతం పలుకుతాయి. ఈ పండుగ రోజున అందరికీ అన్నివిధాల శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలని ఇండియన్ హెరాల్డ్ మనస్పూర్తిగా కోరుకుంటోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: