దసరా వైభవంలో పురాణ గాధ !

Seetha Sailaja
నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను ‘నవ అహోరాత్రాలు’ అని మన ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. తొమ్మిది పగళ్ళు - రాత్రులు అత్యంత నియమ నిష్టలతో చేసే ‘దేవి’ పూజకు ఒక ప్రత్యేకమైన పురాణ ప్ర్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రోజులు జరుపుకునే పూజలను 'శరన్నవరాత్రులు' గా పరిగణిస్తారు. 

వాస్తవానికి ఈకాలం ఋతువుల సంధికాలంగా చెపుతూ ఉంటారు. అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది అని ఋషులు చెపుతారు. ఈకాలంలో పూజాదుల చేత అమ్మను ఆహ్వానించటం ఆమె అనుగ్రహం పొందడం చాల సులభం. ఈ నవాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈతొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేస్తే అనేక శుభ పరిణామాలు కలుగుతాయని మన పెద్దల నమ్మకం. 

కాలచక్రంలో ఆశ్వయుజ మాసంలో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈఋతు పరివర్తన సమయంలో జ్వరాలు, విషజ్వరాలు, కఫం దగ్గు మొదలైన ఉపద్రవాలను నివారించటానికి అనాదిగా దుర్గా పూజా విధానం ఆచరణలో ఉంది. ముఖ్యంగా కుజ గ్రహ దోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించడం చక్కటి పరిహారం గా చెప్పవచ్చు. 

ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి ని మహా శక్తి స్వరూపిణిగా భావిస్తూ సాధకులు విశేష పూజలు చేస్తారు. ముఖ్యంగా లలితా సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయడమే కాకుండా ప్రతిరోజు ఎరుపురంగు పూలు, జమ్మి పూలు, కనకాంబరాల తో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని మన శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి పూజలతో పాటు పరమ శివునికి సిద్ది ప్రధాత వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తారు. రామాయణ కాలంలో శ్రీరాముడు అరణ్య వాసం చేస్తున్నప్పుడు మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఈ దేవి నవరాత్రులలో అత్యంత నిష్టగా దేవి ఆరాధన చేసి శత్రువుల పై విజయం సాధించినట్లు పురాణ గాధలు చెపుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: