త్రివిక్రమ్ ఓర్పుకు సిరివెన్నెల కితాబ్ !

Seetha Sailaja
పాటల రచయితగా వేలసంఖ్యలో పాటలు వ్రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నేటి తెలుగు సినిమాలలోని పాటల పై తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ప్రస్తుతం ‘అంపశయ్య పై’ సినిమా పాట ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఈమధ్య విడుదలై హిట్ అయిన చాల సినిమాలలో పాటలు చాలామందికి గుర్తు ఉండటం లేదు అని కామెంట్స్ చేస్తూ ప్రస్తుతరం ప్రేక్షకులు సినిమాలో పాటలు ఉన్నా లేకున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు అనీ కథ సూటిగా చెప్పే స్థాయి దర్శకుడుకి ఉంటే రానున్న రోజులలో సినిమాలలో పాటలు బాగా తగ్గిపోతాయి అని తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టాడు సిరివెన్నెల. 

ఇదేసందర్భంలో ప్రస్తుత తరం ఆలోచనల గురించి మాట్లాడుతూ ప్రేమించుకోవడం అనేమాట తనకు సినిమాలలోనే కాకుండా సమాజంలో చాలచోట్ల వినిపిస్తోందని ఇంత అనుభవం ఉన్న తనకు ‘ప్రేమించుకోవడం అంటే ఏమిటో అర్ధం కావడం లేదు’ అంటూ యదార్ధంగా చెప్పాలి అంటే ‘మేము కామించుకుంటున్నాం’ అని నేరుగా చెప్పలేక ఇలాంటి పదాలు సృష్టించారు అనుకోవలసి వస్తోంది అంటూ నేటితరం ప్రేమ ఆలోచనల పై సెటైర్లు వేసారు సిరివెన్నెల. 

3వేల పాటలు తను ఇప్పటి వరకు వ్రాసినా తనకు కథలు వ్రాయడం అంటే చాలభయం అని  అంటూ తాను కథలు వ్రాయాలని ప్రయత్నించి మధ్యలో వదిలేసిన కథలు 400 వరకు ఉన్నాయని కథా రచనకు సంబంధించి చాల ఓర్పు ఉండాలి అంటూ అలాంటి ఓర్పు త్రివిక్రమ్ కు చాల ఎక్కువ అని అంటూ త్రివిక్రమ్ ఓపిక తనను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది అంటూ త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపించారు సిరివెన్నెల. ఇదే సందర్భంలో ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం కంటే తనకు చెడ్డ వాళ్ళు వంకర వాళ్ళు తనకు ఎక్కువ స్పూర్తిని ఇస్తారని తన దృష్టిలో ప్రతివ్యక్తిని పరిశీలించడం 50 పుస్తకాలు చదవడంతో సమానం అంటూ కామెంట్స్ చేసారు సిరివెన్నెల.

సినిమా కవిగా మిగిలిపోవడం వల్ల తనకు రావలసినంత గుర్తింపు రాలేదు అన్న ప్రశ్నకు స్పందిస్తూ జీవితం మనం కలలు కనే ఊహలకు అనుగుణంగా ఉండదని మన జీవిత ప్రయాణంలో ఏది వస్తే అది స్వీకరించి అదే విజయం అనుకుని జీవించాలి కానీ కలలు గురించి పరుగులు తీసినంత మాత్రాన ఎంత గొప్ప వ్యక్తికి అయినా విజయాలు రావు అంటూ జీవిత నిజాలను చెపుతున్నారు సీతారామశాస్త్రి. సినిమా పాటలలో ఎన్నో భావాలు ఉంటాయని ఆపాట వినే శ్రోత తన పరిధిని బట్టి తనకు కావలసిన స్థాయిలో ఆపాటను ఎంజాయ్ చేస్తాడని ప్రతివారికి కనెక్ట్ అయ్యేలా ఒకపాటను వ్రాయడం ఎంతటి గొప్ప రచయితకు అయినా కష్టం అంటూ సినిమా కవిగా తన పై పేరుపడినా తనకు ఎటువంటి నిరాశాలేదు అనిఅంటున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: