శ్రీకాంత్ మొదటి సినిమాకు రామోజీ ఎంత ఇచ్చారో తెలుసా..?
హీరోగా 125 సినిమాలు చేయడమంటే మాటలు కాదు.. ఇప్పటి స్టార్ హీరోలు ఎవరూ ఇలాంటి ఫీట్ అందుకునే ఛాన్స్ కనిపించడం లేదు. అలాంటి అరుదైన ఫీట్ అందుకున్న హీరో శ్రీకాంత్. ఇటీవల విడుదలైన ఆపరేషన్ 2019 చిత్రంతో హీరో శ్రీకాంత్ 125 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అనేక విషయాలు మీడియాకు వెల్లడించారు.
హీరో శ్రీకాంత్ ఉషాకిరణ్ మూవీస్ ద్వారా పరిచయమయ్యారు. ఈ బ్యానర్ పై అనేక మంది ప్రముఖులు పరిచయమైన సంగతి తెలిసిందే. పీపుల్స్ ఎన్‌కౌంటర్ అనే సంచలన చిత్రం ద్వారా శ్రీకాంత్ వెండితెరకు పరిచయం అయ్యారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉండేది. ఎన్ కౌంటర్లు, బందులు తీవ్రంగా ఉండే రోజులవి.
ఆ రోజుల్లో నక్సలిజం వంటి సమస్యను చర్చించే సాహసం ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత రామోజీరావు చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ కు పారితోషకంగా ఇచ్చిన సొమ్మెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 5000 రూపాయలు.. అక్షరాలా ఐదు వేల రూపాయలు శ్రీకాంత్‌కు ముట్టాయట.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అరకు లోయలో జరిగిందట. 125 సినిమాలు పూర్తి చేసుకున్నా తొలిరోజు.. కెమేరా ముందుకు వెళ్లిన అనుభూతి తనకు ఇంకా పూర్తిగా గుర్తుందంటారు శ్రీకాంత్. నక్సలైట్ నాయకుడిగా ఆవేశపూరితంగా చెప్పిన డైలాగ్ ఇప్పటికీ తనకు కంఠతా వచ్చంటున్నాడు శ్రీకాంత్. అవును మరి తొలి రోజులు ఎవరూ మరచిపోలేరుగా.