లెజెండ్రీ దర్శకుడి కన్నుమూత..శోక సంద్రంలో భారతీయ ఇండస్ట్రీ!

Edari Rama Krishna
ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన చిత్ర రంగానికి పేరు తీసుకొచ్చిన అతికొద్ది మంది ఫిలిం మేకర్స్‌లో ఒకరైన ప్రముఖ దర్శకుడు మృనాల్ సేన్ (95) కోల్‌కతాలో కన్నుమూసిన విషయం తెలిసిందే.   గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని భవానిపూర్‌లో వున్న సొంత నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు ఆనంద్ బజార్ పత్రిక పేర్కొంది.   మృనాల్ సేన్‌కు 2005లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు కూడా వచ్చింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఫరీద్‌పూర్‌లో మృనాల్ జన్మించారు. 1956లో రాత్ భోర్  చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆకాశ్ కుసుమ్ (1965), భువన్ షోమ్ (1969), కలకత్తా 71, ఇంటర్వ్యూ (1971), ఖాందహార్ (1974), కోరస్ (1975), మృగయ (1977), అకలేర్ సాంధనె (1981), ఏక్ దిన్ అచానక్ (1989)లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. 2002లో వచ్చిన ఆమర్ భువన్ మృనాల్ సేన్ చివరి చిత్రం. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతీయ చలన చిత్రాలను ప్రదర్శించి భారతీయ సినీ రంగం ఖ్యాతిని పెంచేందుకు కృషిచేశారు.   

ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్, అవార్డ్స్ కమిటీలలో ఆయన జ్యూరిగానూ సేవలు అందించారు. వికీపీడియా పేర్కొన్న వివరాల ప్రకారం 1977లో ఆయన తెలుగులో ''ఒక ఊరి కథ'' అనే చిత్రాన్ని సైతం డైరెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మున్షి ప్రేమ్‌చంద్ రచించిన 'కఫాన్' కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అప్పట్లో ఏ పరందామ రెడ్డి అనే నిర్మాత నిర్మించినట్టు వికిపీడియా వివరాలు స్పష్టంచేస్తున్నాయి. మృనాల్ సేన్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృనాల్ సేన్ మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేసిన ఆమె.. సేన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: