తమ్ముళ్ళొస్తున్నారు..తట్టుకోండి..

Arshu
* అన్నతో తమ్ముడు హీరో కావాల‌ని చూస్తున్నారు
* అన్న క్రేజ్‌ ను తమ్ముడు క్యాష్ చేసుకుందామనే
* కొంత మంది సక్సెస్‌ అయ్యారు మరికొంతమంది ఫెయిల్‌
* ఇపుడు ఆనంద్‌ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు


సినిమా క్రేజ్‌ అన్నది సామాన్యుడిలానే సినిమా వాళ్ళకీ ఉంటుంది.  కుటుంబంలో ఎవరైనా హీరోగా మారి పాపుల‌ర్‌ అయిన వెంటనే వారి తాలూకు కుటుంబ సభ్యు లు ఒక్కొక్కరుగా చిత్రసీమలోనికి రావడానికి ఉత్సాహం  చూపుతుంటారు.  ప్ర‌స్తుత ట్రెండ్ కూడా అదే న‌డుస్తుంది. గతంలో కన్నా ఇప్పుడు ఈ రకమైన ఎంట్రీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెక్నికల్ టీమ్‌లోనికి రావడానికి అయితే అంతగా ఇంట్ర‌స్ట్‌ చూపడం లేదు కాని నటన పరంగా మాత్రం దూకేస్తున్నారు. ఆ మాటకొస్తే ఏ మాత్రం రిస్క్‌లేని బిజినెస్‌ ఒక్క నటన మాత్రమే అని చాలామంది ఇప్పటికే ఓపెన్‌ అయిపోయారు. అందుకే కాబోలు రచయితలు, దర్శకులు, నిర్మాతలు కూడా నటన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో రచయితలు ఎక్కువగా సక్సెస్‌ అయిన వాళ్ళలో ఉన్నారు..ఉదా..పరుచూరి వెంకటేశ్వర్రావు, కృష్ణ‌భగవాన్‌, ఎల్‌.బి.శ్రీరాం, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ‌మురళి ఇలా..


హీరో తమ్ముడు హీరోగా , కమెడియన్‌ తమ్ముడు కమెడియన్‌గా, క్యారెక్టరు ఆర్టిస్టు తమ్ముడు క్యారెక్టరు ఆర్టిస్టుగా ఎంట్రీలు ఇస్తున్నారు. అయినప్పటికీ ఇందులో బహుకొద్ది మంది మినహా అందరిలో సీనియర్లు సక్సెస్‌ సాధించినట్టు వారి జూనియర్లు సక్సెస్‌ శాతం తక్కువే.  

పాత తరం వైపు ఒక సారి చూద్దాం..
గతంలో ఎన్టీఆర్‌ తనయులు ఇద్దరు అన్నదమ్ములు హరికృష్ణ‌, బాల‌క్రిష్ణలు  సినీరంగ ప్రవేశం చేసారు.. ఇద్దరిలో బాల‌కృష్ణ‌ మాత్రమే సక్సెస్‌ అయ్యారు.. అలాగే సూపర్‌ స్టార్ కృష్ణ‌ తనయు  రమేష్‌, మహేష్‌లు ఇద్దరూ హీరోలుగా చేసినవారే కానీ మహేష్‌ మాత్రమే సూపర్‌ స్టార్‌ స్థాయికి చేరుకున్నాడు.. మంచు మోహన్‌ బాబు తనయు విషు, మనోజ్ లు సినిమా రంగప్రవేశం గ్రాండ్‌గా జరిగినప్పటికీ వారిద్దరిలో ఎవరూ నాన్న రేంజ్‌లో హిట్‌లు కొట్టలేక పోయారు... దర్శకుడు ఇ.వి.వి. సత్యన్నారాయణ ఇద్దరు కొడుకులు రాజేష్‌, నరేష్ లు ఇద్దరినీ హీరోలుగా పరిచయం చేసినా రాజేష్‌ తెరమరుగై పోయాడు.. అల్ల‌రి నరేష్‌ కామెడీ హీరోగా పేరు సంపాదించాడు... చిరంజీవి తమ్ముళ్ళు ముగ్గురులో ముందుగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు క్యారెక్టరు ఆర్టిస్టుగా పరిమితం కావాల్సివచ్చింది.. కానీ ఆ తరువాత వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మాత్రం చిరంజీవి స్థాయి కల‌క్ష‌న్‌లు  తన సినిమా తీసుకొచ్చేలా కష్టపడ్డాడు.. టాప్‌ ఒన్‌ స్థాయికి చేరుకున్నాడు.. ఇన్నేళ్ళ తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో అన్నదమ్ములిద్దరూ స్టార్ లు అవ్వడం చిరంజీవి బ్రదర్స్‌కు మాత్రమే ఆ ఘనత దక్కిందనే చెప్పాలి...

కొత్త తరం వైపు చూద్దాం..
తెలుగు తమిళ రంగాల్లో సుపరిచితమైన హీరోలు సూర్య, కార్తీ ఇద్దరూ అన్నదమ్ములు.  ఇద్దరూ తెలుగు , తమిళ రంగాల్లో మంచి విజయాలు సాధించారు..  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడు అల్లు అర్జున్‌ హీరోగా మంచి హిట్ లు పొంది బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ అయిన తరువాత ఈ మధ్య కాలంలో రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ ను రంగంలోకి దించాడు ... అరడజను సినిమాలు చేసినా కూడా అల్లు శిరీష్ చెప్పుకోత‌గ్గ‌ హిట్ మాత్రం రాలేదు. ఇక అక్కినేని నాగార్జున త‌న కొడుకులు చైత‌న్య‌, అఖిల్ ఇద్ద‌రూ హీరోలు అయ్యారు. అందులో చైత‌న్య కాస్త హిట్లు వ‌చ్చినా అఖిల్ కు మాత్రం ఎందుకోగాని అస్స‌లు ల‌క్ క‌లిసిరావ‌డం లేదు.  ఇదే బాటలో ఈ మధ్య ట్రెండు సృష్టించిన విజయ్‌ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కూడా హీరోగా దొరసాని సినిమాతో రంగప్రవేశం చేసాడు.. తమ్ముడు సినిమాకు విజయ్‌ దేవరకొండ కూడా ప్రమోషన్‌లో పాల్గొన్నాడు.. అయినా విజయం ఎంత వరకూ వరించిందో, మరో సినిమాకు అవకాశం వస్తుందో రాదో అనేది వేచి చూడాల్సిందే....
ఇదంతా పక్కన పెడితే సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం హీరోలు అవడానికి , నటన వైపు మొగ్గ చూపడానికి ఇష్టపడుతున్నారనేది నిర్వివాదాంశం.....


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: