అదేంటో లక్ ఒకరినే వరిస్తుంది. వారే లక్కుని తొక్కుతారు. పక్కన ఎందరు ఉన్నా కూడా డోంట్ కేర్ అంటూ తప్పించుకుపోతుంది. ఓ సినిమా హిట్ అయితే నాచురల్ గా అందరికీ లక్ రావాలి. కానీ దానికి కూడా వివక్షే మరి. దాంతో కొంతమందికి ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా కూడా ఆఫర్లు రావు. పైగా వారు తెర వెనక్కు వెళ్ళిపోతారు. నిజంగా ఇది బాధాకరమే.
అటువంటి సాడ్ ఫీల్ మన తెలుగు అమ్మాయి రీతు వర్మ కూడా అనుభవించింది. పెళ్ళిచూపులు మూవీలో విజయ్ దేవరకొండతో ఢీ అంటే ఢీ అన్న తీరులో నటించింది. ఆమె అందం అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ తరువాత రీతూ వర్మ ఎక్కడికో వెళ్ళిపోతుందని కూడా సినీ క్రిటిక్స్ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. విజయ్ కి చాన్సులు వరసగా వచ్చి ఆయన సూపర్ స్టార్ డం ఇపుడు ఎంజాయ్ చేస్తున్నాడు. రీతూ వర్మకు మాత్రం టాలీవుడ్ పిలుపే లేదు ఇక ఆమె లాభం లేదనుకుని కూడ్లీవుడ్ కి వెళ్ళిపోయింది.
ఆమె టాలెంటుని తమిళులు మాత్రం బాగానే గుర్తించారు. పెద్ద సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఆమె ఆల్రెడీ విక్రమ్ సరసన ‘ధృవనక్షత్రం’ అనే సినిమాలో నటించింది. దురదృష్టం కొద్దీ ఆ చిత్రం విడుదలకు నోచుకోకుండా పక్కన పడిపోయింది. ఐతే రీతూ మరీ చింతించాల్సిన పని లేకుండా ఇప్పుడో క్రేజీ తమిళ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా పేరు కన్నుం కన్నుం కొలైయడిత్తాల్. మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని సౌత్‌లోని అన్ని భాషల్లోకి అనువదిస్తున్నారు.
తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ అంటూ ‘దొంగా దొంగా’లోని పాటను గుర్తు చేసే టైటిల్ పెట్టారు. ఇక దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ లవ్ స్టోరీల్ని ఇష్టపడేవాళ్ల మనసు దోచేస్తోంది. ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేయనుండడంతో రీతూవర్మకు ఇపుడు తెలుగు అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయేమోనని అనుకుంటున్నారు. ఈ మూవీలో రీతూ అదరగొట్టిందని యూనిట్ టాక్. తెలుగు అమ్మాయి ఇలా పొరుగు నేల నుంచి వచ్చి పలకరిస్తోంది, మరి ఆమె టాలెంట్ ని ఇకనైనా టాలీవుడ్ గుర్తిస్తుందా. ఆలా జరిగితే మరో తెలుగందం అద్భుతమైన పాత్రలకు దొరికినట్లే. చూడాలి. రీతూ కనులు ఎవరినీ దోచాయో, మరెవరినీ దాచాయో. వెయిట్ అండ్ సీ..