పంజాబ్‌లో ఎన్‌ఆర్‌ఐల ప్రచారం...!!

Shyam Rao
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేసేందుకు ప్రవాస భారతీయులు కదిలివచ్చారు. అమెరికాలో ఓ బయో టెక్‌ కంపెనీలో ఉద్యోగం చేసే రాజ్‌వీర్‌ సింగ్‌ మాన్‌ నెల రోజుల సెలవు మీద సొంతూరు లూధియానా వచ్చారు. తనలాగే స్వదేశం వచ్చిన ఎన్‌ఆర్‌ఐలతో కలిసి ఆయన ఇప్పుడు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ‘సుపరిపాలన ఫలితం ఎలా ఉంటుందో విదేశాల్లో చూస్తున్నాం.. స్వదేశంలోనూ అది చూడాలన్నది మా ఆకాంక్ష’ అన్నారాయన. ఆమ్‌ ఆద్మీ పార్టీ తమకు ప్రవాస భారతీయుల అండ ఉందని మొదటినుంచి చెప్తోంది. తమ పార్టీకి 20శాతం నిధులు వారినుంచే వస్తాయని తెలిపింది. ఈసారి మాత్రం వారికోసం ఆప్‌ చలో పంజాబ్‌ ప్రచారం మొదలుపెట్టింది. కేవలం డబ్బే కాదు, సొంతూరి ప్రయోజనాల కోసం మీ సమయం కూడా ఇవ్వాలన్న తమ పిలుపును అందిపుచ్చుకుని ఈసారి 2500 మంది ప్రవాసీ పంజాబీలు స్వదేశం తిరిగి వచ్చారని ఆప్‌ తెలిపింది.



‘పంజాబ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు విదేశాల్లో ఉంటున్నారు. అవకాశాలు, ఉద్యోగాలు, నాణ్యమైన జీవితం లేకపోవడం... ప్రజలను విదేశాల బాట పట్టిస్తోంది. ఎంతైనా సొంత గడ్డను వదలలేం కదా. అందుకే నా వంతు నేను చేస్తున్నాను’ అన్నారు కెనడా నుంచి వచ్చిన కరమ్‌ సింగ్‌ సిద్ధూ.‘37ఏళ్ల క్రితం నేను విదేశాలకు వెళ్లాను. ఎందుకంటే ఇక్కడ నేను నేర్చుకున్న విలువలు నాకెలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేదు. ఇవే విలువల్ని అక్కడ ఆచరిస్తే వ్యవసాయ కూలీ నుంచి జడ్జి స్థాయికి ఎదిగాను..’ అని చెప్పారు హ్యారీ ధాలివాల్‌. ఆయన కుటుంబంతో సహా క్యూబాలో గడపాలనుకున్న సెలవును త్యాగం చేసి ఎన్నికల కోసం పంజాబ్‌ వచ్చారు.వీరే కాదు.. వచ్చే బుధవారం కెనడా నుంచి ఆప్‌ మద్దతుదారులతో ఏకంగా ఓ విమానమే చండీగఢ్‌లో దిగనుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: